Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 1st ODI: భవుమా, దుస్సేన్ సెంచరీలు... తొలి వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోరు...

India vs South Africa 1st ODI: నాలుగో వికెట్‌కి రికార్డు భాగస్వామ్యం... సెంచరీలతో మెరిసిన సౌతాఫ్రికా కెప్టెన్ భవుమా, బ్యాట్స్‌మెన్ దుస్సేన్... టీమిండియా ముందు భారీ లక్ష్యం...

 

INDvsSA 1st ODI: Temba Bavuma, Rassie van der Dussen centuries, Huge target for Team India
Author
India, First Published Jan 19, 2022, 5:56 PM IST

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టీమిండియా ముందు 296 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది.  ప్రారంభంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

జన్నేమెన్ మలాన్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

11 బంతుల్లో 4 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌, వెంకటేశ్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రోకి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...

ఈ దశలో రస్సీ వాన్ దేర్ దుస్సేన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న తెంబ భవుమా... టీమిండియాపై వన్డేల్లో సెంచరీ చేసిన ఐదో సౌతాఫ్రికా కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఏబీ డివిల్లియర్స్, భారత జట్టుపై వన్డేల్లో నాలుగు సెంచరీలు చేయగా, గ్రేమ్ స్మిత్, జాక్వస్ కలీస్, ఫాఫ్ డుప్లిసిస్ తలా ఓ చెరో సెంచరీ చేశారు...

ఓవరాల్‌గా వన్డేల్లో సెంచరీ చేసిన ఏడో సౌతాఫ్రికా కెప్టెన్ భవుమా. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఒక్కడే భారత జట్టుపై వన్డేల్లో కెప్టెన్‌గా సెంచరీ చేయలేకపోయాడు...

టీమిండియాపై వన్డేల్లో సౌతాఫ్రికాకి నాలుగో వికెట్‌కి అత్యధిక భాగస్వామ్యం.. ఇంకతుముందు 2013లో క్వింటన్ డి కాక్, ఏబీ డివిల్లియర్స్ కలిసి జోడించిన 171 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించింది భవుమా, దుస్సేన్ జోడీ...

రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 83 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. నాలుగో వికెట్‌కి 184 బంతుల్లో 204 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన తర్వాత భవుమాను పెవిలియన్ చేర్చాడు బుమ్రా... టీమిండియాపై సౌతాఫ్రికాకి ఓవరాల్‌గా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం...

143 బంతుల్లో 8 ఫోర్లతో 110 పరుగులు చేసిన భవుమా, 49వ ఓవర్ మొదటి బంతికి కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారత జట్టుపై తొలి వన్డే ఆడుతున్న రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 96 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్‌లో ఏకంగా 17 పరుగులు సమర్పించాడు శార్దూల్ ఠాకూర్. 

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 64 పరుగులివ్వగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. యజ్వేంద్ర చాహాల్‌కి కూడా వికెట్ దక్కలేదు.

జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించాడు... హార్ధిక్ పాండ్యా స్థానంలో ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌కి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios