Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 3rd ODI: వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ... న్యూజిలాండ్ ముందు ఈజీ టార్గెట్..

47.3 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... హాఫ్ సెంచరీతో ఆదుకున్న వాషింగ్టన్ సుందర్, 49 పరుగులు చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్...

INDvsNZ 3rd ODI: Washington Sundar scores half century, team india failed to score
Author
First Published Nov 30, 2022, 10:57 AM IST

మొదటి వన్డేలో 300+ పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని నిలబెట్టుకోలేకపోయిన టీమిండియా, మూడో వన్డేలో బ్యాటింగ్‌లో తేలిపోయింది. టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా పరుగులు చేయడంలో విఫలం కావడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు,  47.3 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ విఫలమైనా శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ రాణించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా... 


ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పరుగులు రాబట్టడానికి కష్టపడ్డారు భారత బ్యాట్స్‌మెన్.  12 బంతుల తర్వాత తొలి పరుగు తీసిన శుబ్‌మన్ గిల్, 22 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

45 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్, పద్ధతి మాత్రం మార్చుకోలేదు.

16 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన రిషబ్ పంత్, డార్ల్ మిచెల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయిన రెండో వన్డేలో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

59 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు శ్రేయాస్ అయ్యర్.  వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కాసేపు పోరాడిన దీపక్ హుడా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 25 బంతుల్లో 12 పరుగులు చేసిన దీపక్ హుడా, టిమ్ సౌథీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న న్యూజిలాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. 9 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసిన దీపక్ చాహార్, డార్ల్ మిచెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. యజ్వేంద్ర చాహాల్ 22 బంతుల్లో 8 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన అర్ష్‌దీప్ సింగ్, డార్ల్ మిచెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన వాషింగ్టన్ సుందర్, వన్డేల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 64 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన సుందర్, సౌథా బౌలింగ్‌లో లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి ఆఖరి వికెట్‌గా అవుట్ అయ్యాడు...

న్యూజిలాండ్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 21 పరుగులు ఇవ్వగా ఫీల్డర్లు క్యాచులు మిస్ చేయడం వల్ల టీమిండియా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డార్ల్ మిచెల్ మూడేసి వికెట్లు తీయగా టిమ్ సౌథీకి రెండు వికెట్లు దక్కాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios