Asianet News TeluguAsianet News Telugu

కివీస్‌‌పైనా క్లీన్ స్వీప్.. వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరిన టీమిండియా..

INDvsNZ 3rd ODI Live: స్వదేశంలో టీమిండియా మరో క్లీన్ స్వీప్ చేసింది.  కొద్దిరోజుల క్రితమే శ్రీలంకను  చిత్తుగా ఓడించిన టీమిండియా.. తాజాగా కివీస్ ను కూడా మట్టికరిపించింది.  ఇండోర్ వేదికగా  ముగిసిన మూడో వన్డేలో భారత్..  90 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 
 

INDvsNZ 3rd ODI: India Beats New Zealand by 90 Runs and Becomes World No.1 in ICC ODI Rankings MSV
Author
First Published Jan 24, 2023, 9:04 PM IST

ప్రత్యర్థి మారినా ఫలితంలో మాత్రం తేడా రాలేదు.  ఈ ఏడాది శ్రీలంకతో  వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసుకుని ఘనమైన ఆరంభం చేసిన  భారత జట్టు.. తాజాగా వన్డేలలో ప్రపంచ నెంబర్  2 ర్యాంకర్ గా ఉన్న  న్యూజిలాండ్‌ను  కూడా  అదే విధంగా మట్టికరిపించింది.  బలైమన బ్యాటింగ్ లైనప్ ఉన్న కివీస్.. భారత బౌలర్ల ధాటికి  తలవంచింది. ఇండోర్ వేదికగా ముగిసిన  మూడో వన్డేలో  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..  9  పరుగులకు 385  పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో  కివీస్.. 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్..  90 పరుగుల తేడాతో గెలిచింది. 

కివీస్  ఓపెనర్.. డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138,  12 ఫోర్లు,  8 సిక్సర్లు) పోరాడినా  ఫలితం లేకుండా పోయింది.  ఈ విజయంతో భారత్.. 3-0తో  సిరీస్ ను సొంతం చేసుకుంది.  ఈ విజయంతో  భారత్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.   భారత్ కు 114 పాయింట్లు ఉండగా.. ఇంగ్లాండ్ (113), ఆస్ట్రేలియా (112), న్యూజిలాండ్ (111) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ కు ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తాకింది. హార్ధిక్ పాండ్యా వేసిన  తొలి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ (0) డకౌట్ అయ్యాడు. ఆ జట్టు ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ఆరంభమైంది.కానీ నాలుగో ఓవర్ నుంచి కథ మారిపోయింది. వాషింగ్టన్ సుందర్ వేసిన  నాలుగో ఓవర్లో  కాన్వే రెండు ఫోర్లు కొట్టాడు. శార్దూల్ వేసిన  ఆరో ఓవర్లో నికోలస్.. 6, 4 బాదాడు. బౌలర్ ఎవరన్నదీ పట్టించుకోకుండా.. ఓవర్ కు ఒక  ఫోర్,  సిక్సర్ అన్న  రేంజ్ లో  ఆ జట్టు ఆట సాగింది. పది ఓవర్లకు కివీస్ ఒక  వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 

సుందర్ వేసిన 14వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన కాన్వే.. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేశాడు. నికోలస్ తో కలిసి అప్పటికే వంద పరుగులు పూర్తి చేసి లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో  ఈ జంటను కుల్దీప్ యాదవ్ విడదీశాడు. అతడు వేసిన 15వ ఓవర్  ఐదో బంతికి  నికోలస్ ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు. నికోలస్ ఔటయ్యాక వచ్చిన  మిచెల్ తో కలిసి కాన్వే  రెచ్చిపోయి ఆడాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 23వ ఓవర్ మూడో బంతికి  భారీ సిక్సర్ బాదిన  కాన్వే 90లలోకి వచ్చాడు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్ లో  రెండు భారీ సిక్సర్లు బాది   71 బంతులలో  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేలలో కాన్వేకు ఇది మూడో సెంచరీ.   25 ఓవర్లకు ఆ జట్టు స్కోరు  184-2గా ఉంది. 

బ్రేక్ ఇచ్చిన శార్దూల్.. 

కాన్వే-మిచెల్ లు కలిసి  మూడో వికెట్ కు 78 పరుగులు జోడించారు.  ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని శార్దూల్ విడదీసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. 26వ ఓవర్ వేసిన శార్దూల్.. తొలి బంతికి మిచెల్  ను పెవలియన్ కు పంపాడు. అతడు వేసిన తొలి బంతి..  మిచెల్ బ్యాట్ ను తాకుతూ  వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లో పడింది. దీంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో తర్వాత బంతికి  కెప్టెన్ టామ్ లాథమ్ (0)  హార్ధిక్ పాండ్యాకు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే క్రమంలో శార్దూల్..  తన తర్వాతి ఓవర్లో  గ్లెన్ ఫిలిప్స్ (5) ను కూడా బోల్తా కొట్టించాడు.  భారీ షాట్ ఆడబోయిన ఫిలిప్స్.. కోహ్లీ చేతికి చిక్కాడు. పది బంతుల వ్యవధిలో కివీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 

మిడిలార్డర్ టపటప.. 

వికెట్లు పడుతున్నా  కాన్వే  దూకుడు మాత్రం ఆపలేదు.  సుందర్ వేసిన 29వ ఓవర్లో 6, 4 కొట్టాడు. 30 ఓవర్లకే కివీస్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 217 పరుగులుగా ఉంది.   20 ఓవర్లకు 169 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో రోహిత్.. ఉమ్రాన్ మాలిక్ కు బంతిని అందించాడు.  ఉమ్రాన్ వేసిన 32 వ ఓవర్  నాలుగో బంతిని కాన్వే..  రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. కాన్వే నిష్క్రమణ తర్వాత వచ్చిన సాంట్నర్ 29 బంతుల్లో 34,  3 ఫోర్లు, 2 సిక్సర్లు )తో కలిసి బ్రాస్‌వెల్ (22 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్ లో తొలి వన్డే మాదిరిగా ఏమైనా షాకులిస్తాడా..? అని  టీమిండియా ఆటగాళ్లతో పాటు అబిమానులు కూడా ఆందోళన చెందారు. కానీ  కుల్దీప్ యాదవ్ వారికి ఆ అవకాశమివ్వలేదు.   కుల్దీప్ వేసిన 37వ ఓవర్ రెండో బంతికి  బ్రాస్‌వెల్ ముందుకొచ్చి ఆడబోయాడు.  బాల్ మిస్ అయింది. కానీ వికెట్ల వెనుకాల ఉన్న ఇఫాన్ కిషన్ మాత్రం మిస్ కాలేదు. దీంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. 

ఆ తర్వాత తోకను   కత్తిరించడానికి టీమిండియా పెద్దగా కష్టపడలేదు.  ఫెర్గూసన్ (7) ను కుల్దీప్ ఔట్ చేయగా జాకబ్ డఫ్ఫీ (0) ని  చాహల్ పెవిలియన్ పంపాడు. అదే ఊపులో చాహల్.. సాంట్నర్  ను కూడా ఔట్ చేసి కివీస్ ఇన్నింగ్స్  కు తెరదించాడు. భారత బౌలర్లలో కుల్దీప్, శార్దూల్ లకు తలా మూడు వికెట్లు దక్కగా చాహల్ కు రెండు వికెట్లు దక్కాయి. ఉమ్రాన్, హార్ధిక్ లు తలా ఓ వికెట్ తీశారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి  385 పరుగులు చేసింది.   ఓపెనర్లు  రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) లతో పాటు హార్దిక్ పాండ్యా (54) లు   మెరుపులు మెరిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios