Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd Test: ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్... విజయానికి చేరువలో...

మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసిన న్యూజిలాండ్... భారత జట్టు విధించిన లక్ష్యానికి 400 పరుగుల దూరంలో కివీస్...

INDvsNZ 2nd Test: New Zealand lost five wickets, Team India Need 5 more Wickets, Mumbai Test
Author
India, First Published Dec 5, 2021, 5:26 PM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు, విజయానికి చేరువైంది.  540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. టీమిండియా స్కోరుకి ఇంకా 400 పరుగుల దూరంలో ఉంది న్యూజిలాండ్. టీమిండియా విజయానికి మరో 5 వికెట్లు కావాలి. మరో రెండు రోజుల ఆట మిగిలే ఉండడంతో ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే కివీస్ అద్భుతం చేయాల్సిందే...

మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకి తొలి బ్రేక్ అందించాడు. 6 పరుగులు చేసిన టామ్ లాథమ్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన విల్ యంగ్, అశ్విన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

6 పరుగులు చేసిన రాస్ టేలర్, అశ్విన్ బౌలింగ్‌లోనే ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 55 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కివీస్‌ని డార్ల్ మిచెల్, హెన్రీ నికోలస్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ 18.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, నాలుగో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసిన డార్ల్ మిచెల్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జయంత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న భారత జట్టుకి అనుకూలంగా ఫలితం వచ్చింది...

ఆ తర్వాత వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ 6 బంతులాడి పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. 129 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్...

హెన్రీ నికోలస్ 86 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు, రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. 

ఓవర్‌నైట్ స్కోరు 69/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ఆరంభంలో దూకుడుగా ఆడింది. మొదటి 5 ఓవర్లలో 30 పరుగులు రాబట్టిన పూజారా, మయాంక్ అగర్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. 

మయాంక్ అగర్వాల్ కంటే ఛతేశ్వర్ పూజారా దూకుడుగా ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.  108 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను అజాజ్ పటేల్ అవుట్ చేయడం విశేషం...

అజాజ్ పటేల్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మయాంక్. తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్‌కి తొలి వికెట్ అందివ్వడం విశేషం...

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 50+ స్కోరు నమోదు చేసి... ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 1978లో చేతన్ చౌహన్, సునీల్ గవాస్కర్, 1987లో కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఫీట్ సాధించారు. 

ముంబై వాంఖడే స్టేడియంలో తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు మయాంక్ అగర్వాల్. ఇంతకుముందు సునీల్ గవాస్కర్ ఒకక్కడే ఈ ఫీట్ సాధించాడు...

ఆరంభంలో మయాంక్ అగర్వాల్ కంటే వేగంగా పరుగులు చేసి 57 బంతుల్లో 41 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆ తర్వాత తన స్టైల్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో కుదురుకుపోయాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన పూజారా కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ రెండు సార్లు గాయపడిన శుబ్‌మన్ గిల్, వన్‌డౌన్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

75 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 8 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...

84 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని రచిన్ రవీంద్ర క్లీన్‌బౌల్డ్ చేశాడు... 217 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. అప్పటికే 480 పరుగుల భారీ ఆధిక్యం ఉన్నా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు టీమిండియా...

వృద్ధిమాన్ సాహా 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు అక్షర్ పటేల్...

అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన జయంత్ యాదవ్, అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా. ఆఖర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసిన అక్షర్ పటేల్ నాటౌట్‌గా నిలిచాడు.


మూడు రోజు అంపైర్లు ఇచ్చిన రెండు నిర్ణయాలు తప్పుగా తేలడం విశేషం. మయాంక్ అగర్వాల్‌ను టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. వెంటనే రివ్యూ తీసుకోగా, రిప్లైలో బాల్, బ్యాటుకి తగిలినట్టు స్పష్టంగా కనిపించింది. 

అలాగే అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారాని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు అంపైర్. పూజారా వెంటనే డీఆర్‌ఎస్ తీసుకోగా బంతి, వికెట్ల పై నుంచి వెళ్తున్నట్టుగా కనిపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios