Border Gavaskar Trophy: జడేజా తన చేతికి ఏదో రాసుకున్నాడని, దానితో అతడు వేసే బంతి మెలికలు తిరిగి తమకు ముప్పు వచ్చిందని ఆసీస్ మీడియా అవాకులు చెవాకులు పేలుతున్నది. దీనికి ఇంగ్లీష్ మాజీలు వంత పాడుతున్నారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరు (177) కే ఆలౌటైన తర్వాత కంగారూలకు కంగారెత్తినట్టుంది. తమ ఆటతీరుపై ఎవర్ని నిందించాలో, ఎలా స్పందించాలో తెలియక కొత్త వాదనతో ముందుకొచ్చారు. నాగ్‌పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో తమకు చుక్కలు చూపించిన రవీంద్ర జడేజాను బద్నాం చేయడానికి కుయుక్తులు పన్నారు. జడేజా తన చేతికి ఏదో రాసుకున్నాడని, దానితో అతడు వేసే బంతి మెలికలు తిరిగి తమకు ముప్పు వచ్చిందని అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇక భారత్ లో పిచ్ లు, టీమిండియా ఆటపై శూల శోధన చేస్తూ వీళ్లు ఎక్కడ తప్పులు చేస్తే విమర్శిద్దామా.. అన్నట్టు గోతి కాడి నక్కలా చూసే ఇంగ్లీష్ మీడియా కూడా దీనికి కోరస్ అందుకుంది.
అసలేం జరిగిందంటే.. తొలి రోజు ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో జడేజా 16వ ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అప్పటివరకు జడ్డూ.. 3 కీలక వికెట్లు తీసి జోరుమీదున్నాడు. క్రీజులో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, హ్యాండ్స్‌కాంబ్ ఉన్నారు. అయితే బౌలింగ్ చేయడానికంటే ముందు జడేజా తన చేతికి ఏదో రాసుకున్నాడు. ఏం చేశాడన్నది అప్పుడు క్లారిటీ లేదు. అయితే వీడియోలో మాత్రం అది ఏదో లోషన్ లా అనిపించింది.
అమ్మో.. ఇది చీటింగ్..
ఇప్పుడు ఇదే వీడియో, స్క్రీన్ షాట్లు తీసి ఆసీస్ సెక్స్ చాటింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న మాజీ సారథి టిమ్ పైన్ తో పాటు అక్కడి మీడియా గగ్గోలు పెట్టింది. ‘జడేజా తన చేతికి ఏదో రాశాడు. అందుకే బంతి గింగిరాలు తిరిగింది.. జడేజా బాల్ టాంపర్ చేశాడు. లేకుంటే మా బ్యాటర్లు ఔట్ అయ్యేవారు కాదు..’ అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఇదే అదునుగా అన్నట్టు ట్విటర్ లో ఓ నెటిజన్.. గ్రిప్పింగ్ కోసం జడేజా తన చేతికి ఏదో రాసుకున్నాట్టున్నాడు. మీరు ఏమంటారు అని పిన్ ను అడగ్గా.. ‘ఇంట్రెస్టింగ్’ అని రాసుకొచ్చాడు. కంగారూలు అంత తక్కువ స్కోరుకు ఆలౌట్ అవడాన్ని జీర్ణించుకోలేని అక్కడి ఫ్యాన్స్.. ‘అవునవును.. జడేజా తన చేతికి ఏదో రాసుకున్నాడు. ఇది చీటింగ్’అని గగ్గోలు పెట్టారు.
శత్రువుకు శత్రువు మిత్రువైనట్టు.. యాషెస్ సమయంలో నిత్యం నువ్వెంత అంటే నువ్వెంత కొట్టుకునే ఆసీస్ - ఇంగ్లాండ్ మాజీలు.. భారత్ లో ఏదైనా జరిగితే మాత్రం అంతా కలిసిపోతారు. ఆసీస్ నెటిజన్లు లేవనెత్తిన జడేజా వీడియోపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు. వాన్ స్పందిస్తూ.. ‘అతడు తాను బంతిని స్పిన్ చేసే వేలికి ఏదో పూశాడు. ఇలాంటిదెప్పుడూ చూడలేదు...’అని సన్నాయి నొక్కులు నొక్కాడు.
అది నొప్పి తగ్గించే మందు.. బీసీసీఐ క్లారిటీ
ఈ చర్చ కాస్తా వివాదంగా మారుతున్న నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. జడేజా వేలికి రాసుకున్నది నొప్పిని తగ్గించే ఆయింట్‌మెంట్ అని క్లారిటీ ఇచ్చింది. ఆటగాళ్లు ఇలా వేళ్లకు లోషన్ రాసుకోవడం కొత్తేమీ కాదని, ఐసీసీ నిబంధనలు అందుకు అనుమతిస్తాయని తెలిపింది.
