India vs Australia Test Live: భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అదరగొట్టాడు. ఆడుతున్నది తొలి మ్యాచ్ అయినా ఏడు వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు.
‘నా కొడుకు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ను మరిపిస్తాడు. వార్న్ బౌలింగ్ లో మాదిరే మర్ఫీ బౌలింగ్ లో కూడా వైవిధ్యముంది..’ నాగ్‌పూర్ టెస్టుకు ముందు మర్ఫీ తండ్రి అన్న మాటలివి. తండ్రితో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన మీద పెట్టిన నమ్మకాన్ని ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ నిలబెట్టుకున్నాడు. ఆడుతున్నది తొలి టెస్టు అయినా.. దేశవాళీలో తప్ప అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేకున్నా.. అన్నింటికీ మించి స్పిన్ ను ఆడటంలో దిట్ట అయిన బ్యాటర్లకు బౌలింగ్ వేయడమనేది సవాల్ తో కూడుకున్నదే అయినా.. అన్ని అనుమానాలకు తన బౌలింగ్ తోనే సమాధానం చెప్పాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే ఏడు వికెట్లు తీసి అదరగొట్టాడు. తద్వారా పలు రికార్డులు కూడా బ్రేక్ చేశాడు.
నాగ్‌పూర్ టెస్టులో మర్ఫీ.. 49 ఓవర్లు వేసి 124 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 మెయిడిన్ ఓవర్లు కూడా ఉండటం గమనార్హం. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్.. వికెట్లు తీయడానికి తంటాలు పడ్డ చోట మర్ఫీ మెరిశాడు. ఈ మ్యాచ్ లో లియాన్ కు ఒక్క వికెట్ మాత్రమే దక్కగా మర్ఫీకి ఏడు వికెట్లు దక్కడం విశేషం.
ఈ మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ (కెఎల్ రాహుల్) మొదలుకుని అశ్విన్, పుజారా, కోహ్లీల వికెట్లు మర్ఫీకే దక్కాయి. ఆట రెండో రోజే ఐదు వికెట్లు తీసుకున్న అతడు.. నేడు రవీంద్ర జడేజా ను క్లీన్ బౌల్డ్ చేసిన బంతి మ్యాచ్ కే హైలైట్. ఆ తర్వాత షమీ వికెట్ కూడా అతడి ఖాతాలోకే వెళ్లింది. నాగ్‌పూర్ టెస్టులో ఏడు వికెట్లు తీయడం ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
రికార్డులు :
- ఆస్ట్రేలియా తరఫున అత్యంత పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్ గా నిలిచాడు. మర్ఫీ వయసు 22 ఏండ్ల 87 రోజులు. గతంలో ఈ రికార్డు జోయ్ ప్లామర్ పేరిట ఉండేది. 1882లో ప్లామర్.. 22 ఏండ్ల 360 రోజుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును మర్ఫీ బ్రేక్ చేశాడు.
- తొలి టెస్టులోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆసీస్ బౌలర్లలో మర్ఫీ మూడో స్థానంలో ఉన్నాడు. గతంలో బాబ్ మస్సీ.. 1972లో ఇంగ్లాండ్ (లార్డ్స్ లో) పై ఆడిన టెస్టులో 8 వికెట్లు (8-84) తీశాడు. ఆ తర్వాత 2008-09లో జేసన్ క్రెజా ఇదే నాగ్‌పూర్ వేదికగా జరిగిన టెస్టులో 8 వికెట్లు (8-215) పడగొట్టాడు. తాజాగా మర్ఫీ.. 7 వికెట్లు తీశాడు.
- ఆస్ట్రేలియా తరఫున అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన బౌలర్లలో ఐదో బౌలర్ మర్ఫీ. అంతకుముందు ఈ ఘనత నాథన్ లియాన్, పాట్ కమిన్స్, జోష్ హెడిల్వుడ్, స్కాట్ బొలాండ్ లు మర్ఫీ కంటే ముందున్నారు.
