INDvsAUS 1st Test Live: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలుత ఆసీస్ ను తక్కువ పరుగులకే కూల్చిన భారత్.. తర్వాత బ్యాటింగ్ లో తడబడ్డా నిలబడి భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.

నాగ్‌పూర్ టెస్టుపై భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్.. రెండో రోజు తడబడ్డా నిలబడింది. గింగిరాలు తిరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ పై ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోతున్న వేళ.. కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్, జడేజా లతో కలిపి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రోహిత్ తో పాటు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ వెన్ను విరిచిన రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 నాటౌట్, 9 ఫోర్లు) బ్యాటింగ్ లోనూ రాణించి భారత్ కు కీలక ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జడ్డూ.. అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52 నాటౌట్, 8 ఫోర్లు) తో కలిసి భారత ఆధిక్యాన్ని 144 పరుగులు దాటించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 114 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 

ఓవర్ నైట్ స్కోరు 77 పరుగుల వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ కు శుభారంభమే దక్కింది. రోహిత్ తో పాటు నైట్ వాచ్‌మెన్ రవిచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 23, 2 ఫోర్లు, 1 సిక్స్) లు రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. కానీ తన కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న కుర్రాడు టాడ్ మర్ఫీ ధాటికి భారత మిడిలార్డర్ కకావికలమైంది.

మర్ఫీ మ్యాజిక్.. 

తొలుత మర్ఫీ.. అశ్విన్ ను 41వ ఓవర్లో తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. అశ్విన్ స్థానంలో వచ్చిన ఛటేశ్వర్ పుజారా (7) కూడా విఫలమయ్యాడు. పుజారా ఔటయ్యాక వచ్చిన విరాట్ కోహ్లీ (12) మీద భారత అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. లంచ్ విరామానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. లంచ్ కు ముందు లియాన్, మర్ఫీ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టి ఉత్సాహంగానే కనిపించిన కోహ్లీ.. లంచ్ తర్వాత తొలి బంతికే వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. ఈ వికెట్ కూడా మర్ఫీకే దక్కింది. కోహ్లీ నిష్క్రమణ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) కూడా నిరాశపరిచాడు. సూర్యను నాథన్ లియన్ బౌల్డ్ చేశాడు. 

హిట్ మ్యాన్ సెంచరీ.. 

వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్ మాత్రం సంయమనంతో ఆడాడు. మర్ఫీ వేసిన 63వ ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తిచేసుకున్నాడు రోహిత్. టెస్టులలో రోహిత్ కు ఇది 9వ సెంచరీ. సూర్య తర్వాత వచ్చిన జడేజాతో కలిసి రోహిత్ భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 61 పరుగులు జోడించారు. టీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్.. కమిన్స్ వేసిన 81 వ ఓవర్లో మూడో బంతికి ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. కానీ ఆ తర్వాత బంతికే రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రోహిత్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్ (10 బంతుల్లో 8) కూడా టాడ్ మర్ఫీ వేసిన 84వ ఓవర్లో తొలి బంతికి ఎల్బీ రూపంలో నిష్క్రమించాడు. దీంతో భారత్ ఏడో వికెట్ ను కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మర్ఫీకి ఈ మ్యాచ్ లో ఇది ఐదో వికెట్ కావడం గమనార్హం.

నిలిచిన జడ్డూ-అక్షర్.. 

భరత్ ఔటయ్యాక అక్షర్ పటేల్ సాయంతో రవీంద్ర జడేజా భారత స్కోరును ముందుకు నడిపించాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయాక పట్టుబిగించాలని చూసిన ఆసీస్ కు జడేజా - అక్షర్ లు ఆ అవకాశమివ్వలేదు. ఇద్దరూ కలిసి మూడో సెషన్ లో ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ.. స్కాట్ బొలాండ్ వేసిన 93వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీయడం ద్వారా రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలిసి 8వ వికెట్ కు అజేయంగా 81 (184 బంతుల్లో) పరుగులు జోడించారు. లబూషేన్ వేసిన 105వ ఓవర్ తొలి బంతిని అక్షర్ బౌండరీ బాది భారత్ స్కోరును 300 పరుగులు దాటించాడు. మర్ఫీ వేసిన 111 వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసిన అతడు.. టెస్టులలో తన రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

భారీ ఆధిక్యం దిశగా... 

ఈ ఇద్దరి నిలకడతో భారత్ ప్రస్తుతం 144 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆట మూడో రోజు నుంచి బంతి మరింత స్పిన్ అయ్యే అవకాశం ఉన్నందున శనివారం తొలి సెషన్ లో నిలదొక్కుకోగలిగితే మ్యాచ్ పై భారత్ మరింత పట్టు బిగించొచ్చు. ఇప్పటికే సుమారు 150 రన్స్ ఆధిక్యం సాధించిన టీమిండియా.. మరో 50 పరుగులు జోడించగలిగినా ఆసీస్ కు అవి ఛేదించడం అంత ఈజీ కాదు. మరి శనివారం అక్షర్-జడేజాలు ఏం చేస్తారో చూడాలి. 

ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 36 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. లియాన్, కమిన్స్ లకు తలా ఓ వికెట్ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 177 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. 

సంక్షిప్త స్కోర్లు : 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 177 ఆలౌట్ 
భారత్ తొలి ఇన్నింగ్స్ : 321-7 (రెండో రోజు ఆట ముగిసేటప్పటికి)