INDvsAUS 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఆ నలుగురిపైనే ఫోకస్...
India vs Australia 1st ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్... వన్డే వరల్డ్ కప్ ముందు అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న భారత జట్టు..
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు జరుగుతున్న వన్డే సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు కూడా కీ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చాయి. పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేని కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత ప్లేయర్లకు ఈ వన్డే సిరీస్ కీలకంగా మారనుంది..
అక్షర్ పటేల్ గాయంతో బాధపడుతుండడంతో అతను కోలుకోకపోతే, రవిచంద్రన్ అశ్విన్ లేదా వాషింగ్టన్ సుందర్‌లను వన్డే వరల్డ్ కప్ ఆడించాలని భావిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. ఈ వన్డే సిరీస్‌లో వీరిచ్చే పర్ఫామెన్స్ కారణంగా ఎవరిని వరల్డ్ కప్ ఆడించాలనేది డిసైడ్ కావచ్చు..
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్లు తీస్తున్నా, బ్యాటింగ్‌లో మాత్రం కొంతకాలంగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడ్డూ, బ్యాటింగ్‌లోనూ రాణిస్తే.. టీమిండియాకి సగం టెన్షన్ తగ్గినట్టే.. అలాగే ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న రుతురాజ్ గైక్వాడ్, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆసీస్‌తో రెండు వన్డేలు, అతనికి కీలకంగా మారబోతున్నాయి..
వన్డేల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, మొదటి రెండు వన్డేల్లో ఆడతాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశాడు. అతను ఈ వన్డే సిరీస్‌లో రాణిస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాడు. కాబట్టి అతనికి కూడా ఈ వన్డే సిరీస్ కీలకంగా మారింది. అయ్యర్ ఈ వన్డే సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోతే, వన్డే వరల్డ్ కప్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావచ్చు.
ఎందుకంటే ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లోనూ రాణించగలనని నిరూపించుకున్నాడు. కాబట్టి ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ని కొనసాగించడానికే టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్టపడొచ్చు.
మరోవైపు ఈ వన్డే సిరీస్‌ని, వరల్డ్ కప్‌కి ప్రాక్టీస్‌గా చూస్తోంది ఆస్ట్రేలియా. గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కి దూరంగా ఉన్న స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్.. ఈ వన్డే సిరీస్‌లో ఆడబోతున్నారు. మొదటి మ్యాచ్‌కి మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యారు.
సీన్ అబ్బాట్, ప్యాట్ కమ్మిన్స్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్.. ఇలా ఆస్ట్రేలియాకి బౌలింగ్ ఆప్షన్లు పుష్కలంగా ఉన్నాయి. డేవిడ్ వార్నర్, లబుషేన్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో ఆస్ట్రేలియాని ఓడించాలంటే భారత యంగ్ టీమ్ బాగా శ్రమించాల్సి ఉంటుంది..
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబ్బాట్, ఆడమ్ జంపా
భారత జట్టు: శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ