Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS 1st ODI: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం.. సూర్య కమ్‌బ్యాక్ హాఫ్ సెంచరీ...

India vs Australia 1st ODI: 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం... హాఫ్ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్...

INDvsAUS 1st ODI: Team India beats Australia in first ODI, KL Rahul, Suryakumar Yadav CRA
Author
First Published Sep 22, 2023, 9:57 PM IST

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ని టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. 277 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. ఓపెనర్లు భారీ భాగస్వామ్యం అందించగా కెప్టెన్ కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో సునాయాస విజయం అందుకుంది టీమిండియా..  

భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ మొదటి ఓవర్‌ నుంచి ఆసీస్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశారు..

తొలి వికెట్‌కి 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. 77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, వన్డే ఫార్మాట్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు గైక్వాడ్. 

ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న రుతురాజ్ గైక్వాడ్‌కి ఈ హాఫ్ సెంచరీ, మంచి ఎనర్జీని ఇవ్వొచ్చు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్, తన ఫామ్‌ని కొనసాగించాడు.  మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాది 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు శుబ్‌మన్ గిల్..

వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 8 బంతుల్లో 3 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

142/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, 185/4 స్థితికి చేరుకుంది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ కలిసి ఐదో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వరుసగా వన్డేల్లో విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్, 49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత సూర్య అవుటైనా 63 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, మ్యాచ్‌ని ముగించాడు. 

 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 51 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకి తలా ఓ వికెట్ దక్కింది..

డేవిడ్ వార్నర్ 52 పరుగులు చేయగా జోష్ ఇంగ్లీష్ 45, స్టీవ్ స్మిత్ 41, మార్నస్ లబుషేన్ 39, కామెరూన్ గ్రీన్ 31, మార్కస్ స్టోయినిస్ 29, ప్యాట్ కమ్మిన్స్ 21 పరుగులు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios