Amol Muzumdar: భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు. ముంబై రంజీ జట్టు మాజీ సారథి అమోల్ మజుందార్ త్వరలోనే పూర్తిస్థాయి హెడ్‌కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టుకు త్వరలోనే కొత్త హెడ్‌కోచ్ రానున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అనుభవం ఉండి ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా ఉన్న అమోల్ అనిల్ మజుందార్ త్వరలోనే భారత మహిళల జట్టుకు హెడ్‌కోచ్ గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నాడు.
వివాదాల నడుమ సుదీర్ఘకాలంగా భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ కు హెడ్‌కోచ్ గా చేసిన మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్ ను ఈ ఏడాది వరల్డ్ కప్ కు ముందు బీసీసీఐ.. నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపింది. దీంతో టీమిండియాకు హెడ్‌కోచ్ కుర్చీ ఖాళీగానే ఉంది.
పొవార్ ను తప్పించిన బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ హృషికేష్ కనిత్కర్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. సౌతాఫ్రికాలో ముగిసిన మహిళల టీ 20 వరల్డ్ కప్ లో కనిత్కర్ కోచింగ్ బాధ్యతలు చూసుకున్నాడు. అయితే త్వరలోనే కొత్త కోచ్ రానున్న నేపథ్యంలో తిరిగి కనిత్కర్ ఇండియా అండర్ -19, ఇండియా - ఎ (పురుషుల) టీమ్స్ కు సేవలందించనున్నాడు.
మజుందార్ గురించి..
మహారాష్ట్రకు చెందిన అమోల్ అనిల్ మజుందార్.. రంజీలలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 1993లో రంజీలకు ఎంట్రీ ఇచ్చిన మజుందార్ .. 2006 వ సీజన్ నుంచి 2009 వరకు ముంబైకి కెప్టెన్ గా పనిచేశాడు. 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన మజుందార్.. 11,167 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్థ సెంచరీలున్నాయి. కొద్దిరోజుల పాటు ముంబై టీమ్ కు హెడ్ కోచ్ గా పనిచేసిన ఆయన 2019లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించినప్పుడు సఫారీలకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. సుదీర్ఘకాలం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మజుందార్‌కు జాతీయ జట్టులో ఆడే అవకాశమైతే ఒక్కసారి కూడా రాలేదు.
ఉమెన్స్ టీమ్ హెడ్‌కోచ్ పదవికి అర్హతలు :
భారత మహిళల జట్టు హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి వయసు పరిమితి లేదు. అయితే సదరు అభ్యర్థి తప్పనిసరిగా మినిమం 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి ఉండాలి. ఏదైనా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి కోచ్ గా చేసినట్టు సర్టిఫికేషన్ ఉండాలి. ఎన్సీఏ లెవల్ ‘సి’ సర్టిఫికేషన్ తప్పనిసరి. అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ అనుభవం ఉంటే అది బోనస్ కిందే లెక్క.
