మహిళల టీ20 వరల్డ్‌‌కప్‌లో భారత ఓపెనర్, 16 ఏళ్ల షెఫాలీ వర్మ అదరగొడుతోంది. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్‌‌ను గుర్తుకుతెస్తున్న షెఫాలీ... తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా టాప్  స్థానాన్ని కైవసం చేసుకుంది. 

న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ వుమెన్ సూజీ బైట్స్ ను వెనక్కి నెట్టిన 16 ఏళ్ల షెఫాలీ వర్మ, తాజా ర్యాంకింగ్స్‌లో నెం.1గా నిలిచింది. ర్యాంకింగుల్లో ఈ 16 ఏళ్ల యువ క్రికెటర్ రికార్డులను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ కి గురవుతోంది. 

2018 అక్టోబర్‌లో టాప్ స్థానంలో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ర్యాంక్‌ను కొల్లగొట్టిన న్యూజీలాండ్ ప్లేయర్ సూజీ అప్పటి నుంచి టాప్‌ ర్యాంకులోనే కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఇన్నేళ్ళుగా కాపాడుకుంటూ వచ్చిన స్థానాన్ని షెఫాలీ వర్మ కొల్లగొట్టింది. 

ఫామ్ కోల్పోయి పెద్దగా రాణించలేకపోతున్న భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన్న ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. భారత ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాట్స్ వుమెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉండగా, బౌలింగ్ ‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్ స్టోన్ టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. 

గురువారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడబోతున్నాయి. దీంతో ఈ ఇద్దరు టాప్ ర్యాంకర్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. గత నాలుగు ఇన్నింగ్స్‌లో 161 పరుగులు సాధించిన షెఫాలీ వర్మ.... శ్రీలంకపై 47, న్యూజిలాండ్‌పై 46 పరుగులు చేసి భారత జట్టు సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. 

షెఫాలీ వర్మ బ్యాటింగ్ స్టైల్‌‌ను ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లు ప్రశంసించడం విశేషం. ఇప్పటిదాకా భారత జట్టు వరల్డ్ ‌కప్‌ గెలిచినా దాఖలాలు లేవు. 

ఈసారి షెఫాలీ వర్మ, స్మృతి మంధాన్న, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన్న వంటి బ్యాట్స్ వుమెన్‌తో పాటు భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉండడంతో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత మహిళల జట్టుకు ఈసారి విశేష స్పందన కూడా వస్తోంది. వన్డే వరల్డ్‌కప్ 2019లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్ నుంచి నిష్కమించింది. మరి మహిళల జట్టు అదే సీన్ రిపీట్ చేస్తుందో లేక కప్పు గెలిచి, సగర్వంగా స్వదేశంలో అడుగుపెడుతుందో చూడాలి.