Asianet News TeluguAsianet News Telugu

పీలే రికార్డు బద్దలుకొట్టిన భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.. సాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా

Sunil Chhetri: భారత ఫుట్ బాల్  సారథి సునీల్ ఛెత్రి సరికొత్త రికార్డు సృష్టించాడు. బ్రెజిల్ కు చెందిన దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు పీలే రికార్డును ఛెత్రి బద్దలుకొట్టాడు. 

indian football skipper sunil chhetri breaks brazil legend pele's record as india enter in saff championships finals
Author
Hyderabad, First Published Oct 14, 2021, 2:34 PM IST

భారత్ లో అంతగా ఆదరణ లేని ఫుట్ బాల్ కు విజయాలు నేర్పిస్తున్న కెప్టెన్ సునీల్ ఛెత్రి (Sunil Chhetri) నయా రికార్డు సృష్టించాడు. బ్రెజిల్ (Brazil) ఫుట్ బాల్ దిగ్గజం పీలే (pele) అత్యధిక గోల్స్ రికార్డును ఛెత్రి బద్దలుకొట్టాడు. మాల్దీవులు వేదికగా జరుగుతున్న సాఫ్ ఛాంపియన్షిప్ లో ఛెత్రి అద్భుతమైన ఆటతీరుతో భారత్ ఫైనల్స్ కు చేరింది. 

 సౌత్ ఏషిమన్ ఫుట్బాల్ ఫెడరేషన్  (SAAF) ఛాంపియన్షిప్ లీగ్ లో భాగంగా..  బుధవారం రాత్రి మాల్దీవులు (Maldives)తో భారత్  (india) అమీతుమీ తేల్చుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితేనే  భారత్ ఫైనల్స్ కు ప్రవేశిస్తుంది. ఈ తరుణంలో రెచ్చిపోయిన భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. మాల్దీవులపై 3-1  తేడాతో గెలుపొందారు. భారత జట్టులో సునీల్ ఛెత్రి రెండు గోల్స్  చేయడం గమనార్హం. 

 

 

మ్యాచ్ 62 వ నిమిషంలో గోల్ కొట్టిన ఛెత్రి.. 71 వ నిమిషంలో మరో గోల్ తో భారత్ ను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. మరో భారత ఆటగాడు మన్వీర్ సింగ్ ఆట 33వ నిమిషంలో గోల్ కొట్టాడు. మాల్దీవులు తరఫున అలీ అశ్ఫక్ 45 వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. 

కాగా,  ఈ మ్యాచ్ లో తొలి గోల్ కొట్టగానే  ఛెత్రి.. అంతర్జాతీయ మ్యాచ్ లలో అత్యధిక గోల్స్ కొట్టిన పీలే రికార్డును అధిగమించాడు.  ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో పీలే 77 గోల్స్ కొట్టాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో  (cristiano ronaldo) 115 గోల్స్ తో ప్రథమ స్థానంలో ఉండగా.. అలీ డేయి (ఇరాన్) రెండో స్థానంలో ఉన్నాడు. అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనల్ మెస్సీ  (lionel messi) 80 గోల్స్ తో ఐదో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత 79 గోల్స్ తో ఛెత్రి ఉన్నాడు. 

ఇదిలాఉండగా.. సాఫ్ ఛాంపియన్షిప్ ను ఏడు సార్లు గెలిచిన భారత్.. ఈనెల 16న నేపాల్ తో జరిగే ఫైనల్స్ లో తలపడబోతున్నది. లీగ్ స్టేజ్ లో  నేపాల్ ను భారత్ 1-0తో ఓడించిన విషయం తెలిసిందే. సాఫ్ టోర్నీలో ఫైనల్స్ కు రావడం భారత్ కు ఇది 12వ సారి కావడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios