Asianet News TeluguAsianet News Telugu

అదే మదం.. అదే మనస్తత్వం.. భారత అభిమానులపై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ జాత్యాహంకార వ్యాఖ్యలు

ENG vs IND: ఇంగ్లీష్ అభిమానుల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్  రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లీష్ అభిమానులు భారత అభిమానులను టార్గెట్ గా చేసుకున్నారు. 

Indian Fans Face Racist Abuse From England Spectators During Edgbaston Test, ECB Responds
Author
India, First Published Jul 5, 2022, 10:41 AM IST

రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదన్నట్టు  కాలం మారుతున్నా ఇంగ్లీష్ క్రికెట్ అభిమానుల వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. ఇతర దేశాలు తమ దేశానికి ఆడటానికి వచ్చినప్పుడు వారితో వ్యవహరించే తీరులో ఇంగ్లాండ్ అభిమానులది నాటి నుంచి నేటి వరకూ తమ అహంకార శైలిని మాత్రం వీడటం లేదు. ఒకవైపు తాము ఆడే క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని బాకాలు ఊదుతున్న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. వారి అభిమానుల వల్ల జాతి పరువు గంగలో కలుస్తున్నా దానిపై మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది. ఇంగ్లాండ్ క్రికెట్ లో రేసిజం (జాత్యాహంకారం) ఎక్కువని గతంలో  పలువురు క్రికెటర్లు బహిరంగంగా  వ్యాఖ్యానించినా బోర్డు కంటితుడుపు చర్యలతో సరిపెడుతుండటంతో ఇంగ్లీష్ అభిమానుల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది.

ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్  రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లాండ్ కు చెందిన పలువురు క్రికెట్ అభిమానులు.. భారత అభిమాలను లక్ష్యంగా చేసుకుని జాత్యాహంకార వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టెస్టులో నాలుగో రోజు ఆట సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు టీమిండియా ఫ్యాన్స్ ను టార్గెట్ చేసుకుని జాత్యాహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారని సోషల్ మీడియా వేదికగా ఇండియా ఫ్యాన్స్ ఆరోపించారు. ఇదే విషయమై ట్విటర్ లో పోస్టులు, వీడియోలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. 

ట్విటర్ లో ఓ అభిమాని..‘ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ భారత అభిమానులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. స్టేడియంలోని బ్లాక్ 22 ఎరిక్ హాల్లీస్ వద్ద పలువురు ఇంగ్లీష్ అభిమానులు అతి చేశారు. టీమిండియా ఫ్యాన్స్ ను టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిన వాగారు. దీనిపై మేము గ్రౌండ్ సిబ్బందికి, పై అధికారులకు రిపోర్ట్ చేసినా వాళ్లు పట్టించుకున్న పాపాన పోలేదు.  వాళ్లపై చర్యలు తీసుకోకపోగా మమ్మల్ని సీట్లలో కూర్చొండి అని సలహాలిచ్చారు..’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

 

మరో అభిమాని స్పందిస్తూ.. ‘నేను ఎడ్జబాస్టన్ లో ఉన్నాను. ఇక్కడ  ఇంగ్లీష్ వాళ్లు ఇండియా ఫ్యాన్స్ మీద రేసిజం కామెంట్స్ చేస్తున్నారు.  ఇది మంచి పద్దతి కాదు. ఎవరిమీదైనా రేసిజం కేస్ నమోదైతే జీవితకాల నిషేధం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. క్రికెట్ ఒక ఆట మాత్రమే..’ అని ట్వీట్ చేశాడు. మరో ట్విటర్ యూజర్.. ‘మామీదే కాదు టీమిండియా ఆటగాళ్ల మీద కూడా రేసిజం కామెంట్లు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం.  శార్దూల్ ఠాకూర్, సిరాజ్ మీద జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. యూకేలో క్రికెట్ ఎంతమాత్రమూ జెంటిల్మెన్ గేమ్ కాదు..’ అని రాసుకొచ్చాడు. 

 

ఇక సోషల్ మీడియాలో ఇండియా ఫ్యాన్స్ ఈసీబీని ట్యాగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయగా.. బోర్డు స్పందించింది. ట్విటర్ వేదికగా.. ‘ఈరోజు మ్యాచ్ లో  రేసిజం కామెంట్స్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఇది చాలా ఆందోళనకరం. ఈ విషయంపై మేము గ్రౌండ్ సిబ్బంది, అధికారుల నుంచి  సమాచారం సేకరిస్తున్నాం. దీనిపై మేము విచారణ చేపడతాం.  క్రికెట్ లో రేసిజానికి ఆస్కారమే లేదు..’అని చిలక పలుకులు పలికింది. రేసిజం కామెంట్లు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.. 

Follow Us:
Download App:
  • android
  • ios