భారత క్రికెట్ టీం గురించి తలుచుకోగానే మనకు బ్లూ కలర్ జెర్సీ వేసుకున్న భారతీయ టీం మనకు కన్నుల ముందు కనబడుతుంది. భారతీయ జెర్సీ మనకు ఎంత సుపరిచితమే దాని మీద ఉండే నైకీ లోగో కూడా మనకు అంతే సుపరిచితం. 

సుదీర్ఘ కలం కొనసాగిన అనుబంధం వల్ల నైకి, భారత క్రికెట్‌ జెర్సీ పర్యాయపదాలుగా మారిపోయాయి. గత 14 ఏండ్లుగా భారత క్రికెట్‌ జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా నైకి వ్యవహరిస్తోంది. 

2006లో మొదలైన నైకి, బీసీసీఐ బంధం 2020 సెప్టెంబర్‌తో ముగియనుంది. 2016లో బీసీసీఐతో కిట్‌ భాగస్వామిగా నైకి ఒప్పందం పునరుద్ధరించుకుంది. నాలుగేండ్లకు గాను నైకి రూ. 370 కోట్లు చెల్లించింది. మ్యాచ్‌కు రూ. 87.34 లక్షలు క్రికెట్‌ బోర్డుకు చెల్లించింది. 

ప్రస్తుత సంక్షోభ సమయంలో అంత భారీ మొత్తం వెచ్చించి బీసీసీఐ కిట్‌ భాగస్వామిగా కొనసాగేందుకు నైకి విముఖత వ్యక్తం చేస్తోంది. భారత్‌లో నైకి ఉత్పత్తుల అమ్మకాలు సైతం భారీగా పడిపోయాయి. 

పుమా, ఆడిడాస్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా నైకి మూడో స్థానంలో ఉంది. 2006లో బీసీసీఐతో ఒప్పందం అనంతరం భారత్‌లో 350 స్టోర్లు నడిపిన నైకి ఇప్పుడు స్టోర్ల సంఖ్యను 100కు కుదించేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. 

ప్రస్తుత ఒప్పంద స్థితిలో బీసీసీఐతో భాగస్వామ్యం కొనసాగించలేమని నైకి ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసింది. భారత క్రికెట్‌ ప్రయోజనాల విషయంలో బోర్డు పెద్దలు రాజీపడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. 

ఆర్థికంగా మార్కెట్లు కుదేలయి ఉన్నప్పటికీ... కనీసం ఏడాది కాల వ్యవధితోనైనా నూతన టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉంది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పూర్తి స్థాయి టెండర్లు ఆహ్వానించే ఆలోచనలో బీసీసీఐ కనిపిస్తోంది. అప్పుడు భారీ ధర వస్తుందని బీసీసీఐ యోచిస్తుందే. అలా కాకుండా ఇప్పుడే వేరే ఎవరికీ అప్పగించినా కూడా బోర్డుకు డబ్బులు తక్కువగానే వస్తాయి.