India VS West Indies 1st ODI: పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గా మారిన రోహిత్ శర్మ తన తొలి వన్డేలో టాస్ నెగ్గాడు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత భావోద్వేగమైన క్షణం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే జట్టు చేరుకోని విధంగా వెయ్యో వన్డే ఆడుతున్న భారత జట్టు.. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలివన్డేలో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నది. వెస్టిండీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు టాస్ సందర్భంగా రోహిత్ శర్మ తెలిపాడు.
భారత జట్టుకు ఇది వెయ్యో వన్డే.. కాగా పూర్తి స్థాయి సారథిగా రోహిత్ శర్మకు ఇదే తొలి వన్డే. గతంలో పది వన్డేలకు సారథ్యం వహించినా అది తాత్కాలిక కెప్టెన్ గానే. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. తొలి వన్డేలోనే టాస్ నెగ్గాడు.
ఇన్నాళ్లు విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడిన హిట్ మ్యాన్ కెప్టెన్సీలో ఇప్పుడు మాజీ సారథి ఆడబోతుండటం విశేషం. ఈ ఇద్దరి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది..? కోహ్లి ఎలా ఆడతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ మ్యాచులో భారత జట్టు తరఫున దీపక్ హుడా వన్డేలలో అరంగ్రేటం చేస్తున్నాడు. సిరీస్ ప్రారంభానికి రెండ్రోజుల ముందు భారత జట్టు లోని శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. టీమిండియా ఇద్దరు స్సిన్నర్లు (చాహల్, కుల్దీప్) లతో బరిలోకి దిగుతున్నది. విండీస్ తరఫున ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్, అలెన్ తిరిగి జట్టుతో చేరారు.
జట్లు : ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, ఫబియన్ అలెన్, అల్జారి జోసెఫ్, కీమర్ రోచ్, అకెల్ హొసేన్
