డెఫ్ ఐసీసీ టీ20 ఛాంపియన్స్‌గా టీమిండియా... ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 39 పరుగుల తేడాతో ఘన విజయం... 

భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలిచి 9 ఏళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో 2013లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. అయితే భారత్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్ చేరింది. డెఫ్ (చెవిటివారి) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 ఛాంపయిన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా...

యూఏఈ అజ్మన్‌లోని మాలిక్ క్రికెట్ గ్రౌండ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా, ఫైనల్‌లోనూ ఇదే జోరుని చూపించింది. 

Scroll to load tweet…

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ వీరేంద్ర సింగ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా ఇంద్రజిత్ యాదవ్ 44 బంతుల్లో 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. ఓపెనర్ శివ్ నారాయణ్ శర్మ 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయగా ఆకాష్ సింగ్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. సాయి ఆకాశ్ 2 బంతుల్లో ఓ పరుగు చేసి రనౌట్ అయ్యాడు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 14 పరుగులు భారత జట్టుకి కలిసి వచ్చాయి.

141 పరుగుల లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 19.2 ఓవర్లలో 101 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ఆర్ డు ఫ్లిసెస్ 33 బంతుల్లో ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఏ మెక్‌జీ 6 బంతులాడి యశ్వంత్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా ఆర్ లిమ్‌బాచ్ 7, ఓ సీమిస్ 2, ఆర్ కుమాలో 3, ఎస్ పూనసామీ 9, ఏ వాన్ రూయన్ 12, ఈ మినర్ 7, వార్ డేర్ బర్గ్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ కోలిన్ వెంటన్ 26 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

భారత బౌలర్లలో యశ్వింత్, జితేందర్ త్యాగి, కుల్దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా సాయి ఆకాశ్, వివేక్ చెరో వికెట్ తీశారు. సౌతాఫ్రికాతో ఫైనల్‌కి ముందు గ్రూప్ స్టేజీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై ఘన విజయాలు అందుకుంది భారత జట్టు.