Indw vs Ausw: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి, ఏకైక డే అండ్ నైట్ టెస్టు (Day and night test) కు మొదటి రోజు వరుణుడు అంతరాయం కల్పించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో నిలకడగా ఆడుతున్నది. 

భారత మహిళల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడుతున్న డే అండ్ నైట్ టెస్టులో మొదటి రోజు ఆట వర్షార్పణం అయింది. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఏకైక డే అండ్ నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన మిథాలి (mithali raj) సేనకు ఓపెనర్లు స్మృతి (smriti mandhana) మంధాన (144 బంతుల్లో 80 నాటౌట్), షెఫాలి (shefali verma) వర్మ (64 బంతుల్లో 31) శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన పేస్ బలగమున్న ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి చూడచక్కని షాట్ లతో అలరించారు. 

Scroll to load tweet…

ముఖ్యంగా మంధాన అయితే ఫోర్ల సునామి సృష్టించింది. ఆమె సాధించిన 80 పరుగులలో (15 ఫోర్లు, 1 సిక్సర్) 66 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయంటే ఆమె విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Scroll to load tweet…

మంధాన దాటికి ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ భారీగా పరుగులు సమర్పించుకుంది. కానీ 25 ఓవర్లో మోలినెక్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన షెఫాలీ.. మెక్ గ్రాత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. డిన్నర్ తర్వాత పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినా మంధాన మాత్రం సహజ శైలిలోనే ఆడింది. వన్ డౌన్ లో వచ్చిన పూనమ్ రౌత్ (16 నాటౌట్) తో కలిసి చక్కటి సంయమనం ప్రదర్శించింది. ఈ క్రమంలోనే టెస్టులలో కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేసింది. టీకి ముందు నుంచే మళ్లీ వర్షం కురవడంతో పాటు వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆటను రద్దు చేశారు.