Asianet News TeluguAsianet News Telugu

INDW vs SLW: తొలి టీ20 భారత్ దే.. లంకను చిత్తుగా ఓడించిన హర్మన్ ప్రీత్ సేన

INDW vs SLW T20I: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు .. సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. దంబుల్లాలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో తడబడినా బౌలింగ్ లో రాణించింది. 

India Women Beat Sri lanka in First T20I by 35 Runs
Author
India, First Published Jun 23, 2022, 6:23 PM IST

శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత మహిళల  క్రికెట్ జట్టు.. తొలి టీ20లో విజయం సాధించింది. దంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (36), షఫాలీ వర్మ (31), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22) లు రాణించారు. అనంతరం లంక మహిళల జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. భారత బౌలర్లు లంక బ్యాటర్లను కట్టడి చేయడంతో విజయం టీమిండియా సొంతమైంది. రోడ్రిగ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1) తో పాటు వన్ డౌన్  లో వచ్చిన  తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (0) లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. కానీ హర్మన్ ప్రీత్ తో కలిసి షఫాలీ దూకుడుగా ఆడింది. 

 

31 బంతుల్లో 4 ఫోర్లతో 31 రన్స్ చేసిన షఫాలీ.. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో నాలుగో వికెట్ గా వెనుదిరిగింది.  ఇక ఆ తర్వాత వచ్చిన రోడ్రిగ్స్.. 27 బంతుల్లోనే 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 36 రన్స్ చేసి భారత్ కు  గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివర్లో దీప్తి శర్మ.. 8 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో లంక ఎక్కడ కూడా లక్ష్యం దిశగా సాగినట్టు కనిపించలేదు. ఓపెనర్లు విష్మి గుణరత్నె (1), చమారి ఆటపట్టు (16), హర్షిత మాదవి (10) లు త్వరత్వరగా పెవిలియన్ చేరారు. కానీ మిడిలార్దర్ బ్యాటర్ కవిష దిల్హరి (49 బంతులలో 47 నాటౌట్.. 6 ఫోర్లు) చివరివరకు ఆడినా జట్టును గెలిపించలేకపోయింది. భారత జట్టులో రాధా యాదవ్ రెండు వికెట్లు తీయగా..  దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్ లో తర్వాత మ్యాచ్ శనివారం ఇదే వేదికలో జరుగనుంది. మూడు టీ20లతో పాటు భారత జట్టు లంకతో మూడు వన్డేలు కూడా ఆడనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios