వెస్టిండిస్ పర్యటనను టీమిండియా విజయంతో మొదలుపెట్టి విజయంతోనే  ముగించింది. అసలు ఓటమన్నదే లేకుండా ఈ పర్యటనను ముగించింది. టీ20, వన్డే సీరిస్ ల  మాదిరిగానే టెస్ట్ సీరిస్ ను కూడా కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేసింది.

రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విండీస్ చేతులెత్తేసింది. భారత్ నిర్దేశించిన 468 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓవర్ నైట్ స్కోరు 45/2 వద్ద నాలుగోరోజు బ్యాటింగ్ ఆరంభించిన  విండీస్ జట్టు కొద్దిసేపు పోరాడింది. అయితే కొండంత లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేక 210 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ 257 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. 

సెకండ్ ఇన్నింగ్స్ లో విండీస్ బ్యాట్స్ మెన్స్  బ్రూక్స్ (50  పరుగులు), బ్లాక్ వుడ్(38 పరుగులు), కెప్టెన హోల్డర్(39 పరుగులు) లు కాస్సేపు భారత విజయాన్ని అడ్డుకున్నారు. వీరి పోరాటం వల్లే మొదటి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే చాపచుట్టేసిన విండీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో కనీసం 210 పరుగులయినా  చేయగలిగింది. భారత బౌలర్లలో జడేజా 3, షమీ 3, ఇషాంత్ 2, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. 

ఇలా విండీస్ ను వారి సొంత గడ్డపై మట్టికరిపించి టెస్ట్ సీరిస్ ను టీమిండియా కైవసం  చేసుకుంది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కూడా 120 పాయింట్లు సాధించి మంచి ఆధిక్యాన్ని పొందింది.