హాఫ్ సెంచరీతో అదరగొట్టిన నికోలస్ పూరన్.. 2 వికెట్ల తేడాతో రెండో టీ20లో విజయాన్ని అందుకున్న వెస్టిండీస్.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలోకి.. 

వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో టీ20లోనూ ఓడింది. తిలక్ వర్మ తప్ప మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో 152 పరుగుల స్కోరు చేసిన టీమిండియా, ఆ స్కోరుని కాపాడుకోవడంలోనూ విఫలమైంది. విండీస్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయినా, టీమిండియా ఆ ఛాన్స్‌ని సరిగ్గా వాడుకోలేకపోయింది. 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్, వరుసగా రెండో విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.. 

153 పరుగుల లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికి బ్రెండన్ కింగ్‌, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన జాసన్ ఛార్లెస్, మొదటి నాలుగో బంతికి పెవిలియన్ చేరాడు..

2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. రెండో ఓవర్ తొలి బంతికి నికోలస్ పూరన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు తేలడంతో నాటౌట్‌గా తేలాడు పూరన్. 7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన కైల్ మేయర్స్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

రవిభిష్ణోయ్ బౌలింగ్‌లో పావెల్ అవుట్ అయినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. టీమిండియా డీఆర్‌ఎస్ తీసుకోకపోవడంతో వికెట్ దక్కలేదు. 19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో ముకేశ్ కుమార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన నికోలస్ పూరన్, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే 36 బంతుల్లో 27 పరుగులు మాత్రమే కావాల్సిన ఈజీ స్థితికి చేరుకుంది వెస్టిండీస్.. 

యజ్వేంద్ర చాహాల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొదటి బంతికి రొమారియో షెఫర్డ్ రనౌట్ అయ్యాడు. 3 బంతులు ఆడిన జాసన్ హోల్డర్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 

22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్, 24 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది.. 

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 18వ ఓవర్‌లో 9 పరుగులు రాగా ముకేశ్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్ బాదిన అల్జెరీ జోసఫ్, మ్యాచ్‌లో హై డ్రామాకి తెరదించాడు. అదే ఓవర్‌లో అకీల్ హుస్సేన్ ఫోర్ బాదడంతో వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో సిమ్రాన్ హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

3 బంతుల్లో 1 పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్, రనౌట్ అయ్యాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన సంజూ శాంసన్, స్టంపౌట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన సంజూ శాంసన్, మరో అవకాశాన్ని వృథా చేసేశాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాని అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్, వెస్టిండీస్ టూర్‌లో మరో ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వస్తూనే ఫోర్ బాదగా, రవి భిష్ణోయ్ సిక్సర్‌తో టీమిండియా స్కోరు బోర్డును 150 దాటించాడు. అర్ష్‌దీప్ సింగ్ 6, రవి భిష్ణోయ్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.