India vs West Indies 1st Test తొలి ఇన్నింగ్స్‌లో పరుగులకి వెస్టిండీస్ ఆలౌట్.. 700 అంతర్జాతీయ వికెట్ల క్లబ్‌లో రవిచంద్రన్ అశ్విన్..

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చిత్తుగా ఓడి, నెల రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, 64.3 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ 5 వికెట్లతో విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సెషన్‌లో 4 వికెట్లు తీసిన భారత బౌలర్లు, రెండో సెషన్‌లోనూ నాలుగు వికెట్లు పడగొట్టి, మూడో సెషన్‌ మొదటి పావుగంటలోనే... విండీస్‌ని ఆలౌట్ చేసేశారు. 

మొదటి 12 ఓవర్లలో వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేసిన విండీస్, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.. క్రెగ్ బ్రాత్‌వైట్, టగెనరైన్ చంద్రపాల్ కలిసి ఆచితూచి ఆడుతూ భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశారు. 12.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. 44 బంతుల్లో 12 పరుగులు చేసిన టగెనరైన్ చంద్రపాల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

2011లో శివ్‌నరైన్ చంద్రపాల్‌ని అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, 2023లో అతని కొడుకు టగెనరైన్ చంద్రపాల్‌ని అవుట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తండ్రీకొడుకులను అవుట్ చేసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

46 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్, అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 2 పరుగులు చేసిన రోమన్ రిఫర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

34 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన జెర్మైన్ బ్లాక్‌వుడ్‌, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌ పట్టిన కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 2 పరుగులు చేసిన జోషువా డి సిల్వ, జడేజా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా అల్జెరీ జోసఫ్ 11 బంతుల్లో ఓ ఫోర్ బాది 4 పరుగులకు అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో ఇది 700వ అంతర్జాతీయ వికెట్. టీమిండియా తరుపున 700లకు పైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన మూడో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అనిల్ కుంబ్లే 956 వికెట్లతో టాప్‌లో ఉంటే, హర్భజన్ సింగ్ 711 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.

తొలి టెస్టు ఆడుతున్న అలిక్ అతనజే, 99 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన అతనజే, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లోనే శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 129 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్, 150 పరుగులైనా దాటుతుందా? అనేది అనుమానంగా అనిపించింది..

అయితే టీ బ్రేక్ తర్వాత దూకుడు పెంచిన రహ్కీమ్ కార్న్‌వాల్, అశ్విన్ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. 16 బంతుల్లో ఒక్క పరుగు చేసిన కీమర రోచ్, జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కింది. రహ్కీమ్ కార్న్‌వాల్, జోమెల్ కలిసి విండీస్ స్కోరుని 150 మార్కు దాటించారు. 13 బంతుల్లో 1 పరుగు చేసిన జోమెల్, అశ్విన్ బౌలింగ్ అవుట్ కావడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. రహ్కీమ్ కార్న్‌వాల్ 34 బంతుల్లో 3 వికెట్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.