నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసిన సౌతాఫ్రికా... అజేయ హాఫ్ సెంచరీతో క్రీజులో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్...
సెంచూరియన్ టెస్టులో భారత జట్టు విజయం అంచుల్లో నిలిచింది. 305 పరుగుల భారీ టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికా జట్టు... నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది... ఆఖరి రోజు సౌతాఫ్రికా విజయానికి ఇంకా 211 పరుగులు కావాల్సి ఉండగా, భారత జట్టు ఆరు వికెట్లు తీయాల్సి ఉంటుంది...
305 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టుకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న అయిడిన్ మార్క్‌రమ్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత కీగన్ పీటర్సన్, డీన్ ఎల్గర్ కలిసి రెండో వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
36 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రస్సీ వాన్ దేర్ దుస్సేన్, ఎల్గర్ కలిసి మూడో వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడదీశాడు...
65 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్, డీన్ ఎల్గర్ కలిసి నాలుగో వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది సౌతాఫ్రికా. కెప్టెన్ డీన్ ఎల్గర్ 122 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉండడం సఫారీ జట్టుకి సానుకూల అంశం. ఇంకా భవుమా, క్వింటన్ డి కాక్, ముల్దర్ వంటి బ్యాట్స్‌మెన్ ఉండడంతో 211 పరుగులు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు...
భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పిచ్, బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తుండడం కూడా సఫారీ జట్టుకి కలిసి వచ్చే అంశమే. అయితే బుమ్రా, షమీ, సిరాజ్ రాణిస్తే మాత్రం భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఐదో రోజు సెంచూరియన్‌లో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.
ఇప్పటికే వర్షం కారణంగా ఆటలో రెండో రోజు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఐదో రోజు కూడా అదే సీన్ రిపీట్ అయితే సఫారీ జట్టును ఓడించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించాలనే టీమిండియాపై నీళ్లు చల్లినట్టే అవుతుంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 327 పరుగులకి ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా జట్టు 197 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి 130 పరుగుల ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
