వెస్టిండిస్ పర్యటన అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సపారీలతో స్వదేశంలో జరిగే టీ20 సీరిస్ కోసం భారత జట్టు ఖరారయ్యింది. మరో 15రోజుల్లో ఆరంభంకానున్న మూడు టీ20ల సీరిస్ కోసం 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు బిసిసిఐ అధికారికి ట్విట్టర్ లో ఆటగాళ్ల లిస్ట్ ను పొందుపర్చింది. 

వెస్టిండిస్ పర్యటన ద్వారా టీ20 లో ఆరంగేట్రం చేసిన నవదీప్ సైనీ ఈ సీరిస్ కు కూడా ఎంపికయ్యాడు. అలాగే వికెట్ కీపర్ గా వరుసగా విఫలమవుతున్నప్పటికి సెలెక్షన్ కమిటీ రిషబ్ పంత్ కు మరో అవకాశాన్నిచ్చింది. పంత్ కు ఎక్కువగా  అవకాశాలివ్వాన్న ఉద్దేశ్యంతో ఈ సీరిస్ కు సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనిని పక్కనపెట్టారు. 2020 టీ ట్వంటీ  వరల్డ్ కప్ నాటికి రిషబ్ పంత్ ను పూర్తిస్థాయి వికెట్  కీపర్ మార్చాలని  టీమిండియా  మేనేజ్ మెంట్ భావిస్తోంది. 

ఇక ఈ సీరిస్ లో రెండు అన్నదమ్ముల జోడీలు ఎంపికయ్యాయి. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో పాటు రాహుల్ చాహర్, దీపక్ చాహర్ లు ఈ  సీరిస్  కు ఎంపికయ్యారు. ప్రపంచ కప్ తర్వాత జరిగిన  వెస్టిండిస్ టూర్ కు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా ఈ టీ20  సీరిస్ ద్వారా మళ్లీ జట్టులో కలవనున్నాడు. విండీస్ పర్యటనలో రాణించిన శ్రేయాస్ అయ్యర్ కూడా  ఎంపికయ్యాడు. 

ఈ సిరిస్ కు బుమ్రా, షమీ లతో పాటు స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ లు కూడా దూరమయ్యారు. ప్రపంచ కప్ తర్వాత వెంటనే వెస్టిండిస్ పర్యటనకు  వెళ్లిన వీరికి విశ్రాంతినివ్వాలనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15, 18, 22 తేదీల్లో భారత్-దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి.  

భారత జట్టిదే: 
రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైని.