మొదటి టీ20 మ్యాచ్‌కి ముందు కరోనా పాజిటివ్‌గా తేలిన అయిడిన్ మార్క్‌రమ్... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ముందు బయో బబుల్‌ను తొలగించిన బీసీసీఐ...
రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్... క్రికెట్ ప్రపంచాన్ని వదలడం లేదు. కరోనా కారణంగా కొన్ని సిరీస్‌లు వాయిదా పడగా, మరికొన్ని టోర్నీలు ఏకంగా రద్దు అయ్యాయి. ఆటగాళ్లను కరోనా భూతం నుంచి రక్షించేందుకు బయో బబుల్ సెక్యూర్ జోన్‌ని ఏర్పాటు చేసి, ఆటగాళ్ల కదలికపై అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చింది బీసీసీఐ...
ఆటగాళ్లకు కేటాయించిన గదుల్లోనే ఉండాలి, వారి హోటల్‌ని దాటి బయటికి వెళ్లకూడదు. బయో బబుల్‌లోకి బయటికి వ్యక్తులు రాకూడదు. కుటుంబ సభ్యులను కలవడానికి కూడా వీలు ఉండదు.. ఎలా అనేక ఆంక్షల మధ్యే రెండేళ్లుగా క్రికెట్ ఆడుతూ వచ్చారు క్రికెటర్లు...
ఎట్టకేలకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బయో బబుల్ ఏర్పాటు చేయడం లేదని, ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆటపై ఫోకస్ పెట్టవచ్చని సూచించింది బీసీసీఐ. బయో బబుల్ సంకెళ్లు తెగిపోయిన జైలు నిర్భందం నుంచి బయటపడినట్టు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు ప్లేయర్లు...
అయితే ఆ స్వాతంత్ర్యం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడి అదరగొట్టిన సఫారీ ప్లేయర్ అయిడిన్ మార్క్‌రమ్, తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలాడు... ఐపీఎల్ 2022 సీజన్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అయిడిన్ మార్క్‌రమ్ లేకపోవడం, సౌతాఫ్రికాపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు...
మిగిలిన ప్లేయర్లకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ రావడంతో మ్యాచ్‌ను సజావుగా నిర్వహించారు. అయిడిన్ మార్క్‌రమ్‌ని ఐసోలేషన్‌కి తరలించిన సిబ్బంది, అతని ఆరోగ్య పరిస్థితిని అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు.
పూర్తి కట్టుదిట్టమైన బయో సెక్యూర్ జోన్‌లో ఐపీఎల్ 2021, 2022 సీజన్‌లను నిర్వహించిన సమయంలోనే కరోనా వైరస్‌ని అడ్డుకోలేకపోయింది బీసీసీఐ. 2021 సీజన్ మధ్యలో కరోనా కేసులు వెలుగు చూడడంతో ఐపీఎల్‌ను అర్ధాంతరంగా ఆపి వేసి, మూడు నెలల తర్వాత నిర్వహించాల్సి వచ్చింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని కరోనా వైరస్ వెంటాడింది. మిచెల్ మార్ష్‌తో పాటు కొందరు సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో పూర్తిగా కరోనా భయం తొలిగిపోకముందే బయో బబుల్ లేకుండా మ్యాచులు నిర్వహించాలనే బీసీసీఐ ఆలోచన కరెక్ట్ కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ విజయవంతంగా ముగిస్తే మాత్రం... క్రికెట్‌లో బయో బబుల్ జోన్‌ని పూర్తిగా తొలగించాలనే డిమాండ్ పెరగవచ్చు.
