భారత్ పై నోరుపారేసుకున్న ఓ సఫారీ క్రికెటర్ కి సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు గడ్డిపెడుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ వల్ల తాను ప్రపంచకప్ సరిగా ఆడలేకపోయానంటూ..దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లిసెస్ అని... భారత్ క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా... భారత్ లో హోటల్స్, ఆహారం సరిగా లేదంటూ డీన్ ఎల్గర్ చేసిన కామెంట్స్.. మరింత ఆగ్రహానికి దారితీశాయి. ట్విట్టర్ వేదికగా డీన్ ఎల్గర్ పై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఆట ఆడటం చేతకాక ఆహారంపై కామెంట్స్ చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ మీడియాతో తన ప్రదర్శన గురించి మాట్లాడాడాడు. భారత్ పర్యటనలో తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇక్కడ క్రికెటర్ గానే కాకుండా వ్యక్తిగతంగానూ తాను ఇబ్బంది పడినట్లు చెప్పాడు. చిన్న ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ హోటళ్లలో ఆహారం అంతగా బాగోడం లేదని చెప్పాడు. అలాంటి సమయంలో ఆ ప్రభావం తమ ఆటపై చూపిస్తోందని పేర్కొన్నాడు.

కాగా.. డీన్ ఎల్గర్ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మా దేశ ఆహారం బాలేదని అంటావా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఓటమికి ఇలాంటి కారాణాలు వెతుకుతున్నారంటూ కొందరు ట్వీట్ చేయగా... మరికొందరు మాత్రం ఆడటం చేతకాక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు.

2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో భారతీయ క్రికెటర్లకు నీటి సమస్య ఎదురైన సందర్భాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తుండటం విశేషం. దక్షిణాఫ్రికాతో టీం ఇండియా ప్రస్తుతం టెస్టు మ్యాచ్ కోసం తలపడుతుండగా... 2-0తో భారత్ లీడ్ లో ఉంది. ప్రస్తుతం రాంచీ వేదికగా మ్యాచ్ జరుగుతోంది.