Asianet News TeluguAsianet News Telugu

మూడో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోరు... క్లీన్ స్వీప్ తప్పించుకోవాలంటే టీమిండియా ముందు...

INDvsSA 3rd ODI: 49.5 ఓవర్లలో 287 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... క్వింటన్ డి కాక్ రికార్డు సెంచరీ, ప్రసిద్ధ్ కృష్ణకి మూడు వికెట్లు...

India vs South Africa 3rd ODI: Quinton De Kock Century and Van der Dussen Half century, SA scored
Author
India, First Published Jan 23, 2022, 6:06 PM IST

మొదటి రెండు వన్డేలు గెలిచి, ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికా... ఆఖరి వన్డేలోనూ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 49.5 ఓవర్లలో 287 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  భువనేశ్వర్ కుమార్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన దీపక్ చాహార్, తన రెండో ఓవర్‌ మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. 6 బంతుల్లో ఒక్క పరుగు చేసిన జన్నేమన్ మలాన్, కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టు బౌలర్లు, సింగిల్ డిజిట్ స్కోరు వద్ద వికెట్ తీయడం ఇదే తొలిసారి. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన సఫారీ కెప్టెన్ తెంప భవుమా, కెఎల్ రాహుల్ కొట్టిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు...

34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత బౌలర్లు 10 ఓవర్లలోపు రెండు వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. 14 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్ కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (సబ్‌స్టిట్యూట్)కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. అయితే ఆ తర్వాత క్వింటన్ డి కాక్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న క్వింటన్ డి కాక్, వన్డేల్లో 17వ సెంచరీ నమోదు చేశాడు...

భారత జట్టుపై క్వింటన్ డి కాక్‌కి ఇది ఆరో వన్డే సెంచరీ కావడం విశేషం. భారత జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు క్వింటన్ డి కాక్. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 85 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు చేస్తే, క్వింటన్ డి కాక్ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేశాడు...

మొదటి వన్డేలో 68 పరుగులకే 3 వికెట్లు తీసిన తర్వాత భవుమ, దుస్సేన్ కలిసి ద్విశతాధిక భాగస్వామ్యం నెలకొల్పి సౌతాఫ్రికాని ఆదుకుంటే, మూడో వన్డేలో క్వింటన్ డి కాక్, దుస్సేన్ కలిసి నాలుగో వికెట్‌కి 144 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 124 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను జస్ప్రిత్ బుమ్రా అవుట్ చేశాడు...

59 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన వాన్ దేర్ దుస్సేన్‌, చాహాల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అదిలే ఫిలూక్వాయో 4 పరుగులు చేసి రనౌట్ కాగా డ్వేన్ పెటోరియస్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... కేశవ్ మహరాజ్ 6 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఆ తర్వాత రెండో బంతికే మగల డకౌట్ కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కి తెరపడింది. 

ఒకే ప్రత్యర్థిపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు క్వింటన్ డి కాక్. న్యూజిలాండ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 23 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేస్తే, క్వింటన్ డి కాక్ 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును చేరుకున్నాడు...

అలాగే భారత జట్టుపై వన్డేల్లో 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు క్వింటన్ డి కాక్. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకోగా, క్వింటన్ డి కాక్ ఆ రికార్డును సమం చేశాడు... భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకి మూడు వికెట్లు దక్కగా, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios