India vs South Africa 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్... గాయంతో రెండో టెస్టులో బరిలో దిగని విరాట్ కోహ్లీ...

2022 ఏడాదిని కొత్త సారథితో ఆరంభించనుంది టీమిండియా. జోహన్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా నయా కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెగ్యూలర్ భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ, భారత ఫిజియోతో కలిసి గ్రౌండ్‌లో కనిపించాడు. రెండో టెస్టుకి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో విరాట్ స్థానంలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, రెండో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు... విరాట్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడని, మూడో టెస్టు సమయానికి అతను కోలుకుంటాడని కెఎల్ రాహుల్ తెలిపాడు.

Read: 19 ఏళ్ల పురుష క్రికెటర్‌పై అత్యాచారం, వేధింపులు... ఆస్ట్రేలియా జట్టులో కలకలం...

కెఎల్ రాహుల్‌కి ఇంతకుముందు ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. 2019లో ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా, నేటి మ్యాచ్‌కి కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఈ మ్యాచ్ ఆడి ఉంటే కేప్ టౌన్‌‌లో జరిగే మూడో టెస్టు, విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ అయ్యేది. రెండో టెస్టు మ్యాచ్‌కి దూరం కావడంతో కేప్ టౌన్ టెస్టు ఆడినా, అది అతనికి 99వ టెస్టు కానుంది.

జోహన్‌బర్గ్‌లోని ది వండరర్స్ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఓడిపోకపోవడం విశేషం... 1992, 1997, 2013 టెస్టు మ్యాచులను డ్రా చేసుకున్న భారత జట్టు, 2006లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది జోహన్‌బర్గ్‌లోనే...

2018లో మొదటి రెండు టెస్టులను ఓడిన విరాట్ కోహ్లీ, జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో 63 పరుగుల తేడాతో గెలిచి... సౌతాఫ్రికాలో కెప్టెన్‌గా తొలి టెస్టు విజయాన్ని అందుకున్నాడు...
ది వండరర్స్ స్టేడియంలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లో 119, 96, 54,41 పరుగులతో 310 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాన్ రీడ్ ఇక్కడ 316 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. మరో 7 పరుగులు చేసి విరాట్, జాన్ రీడ్ రికార్డును అధిగమించేవాడు...

తనకి అచొచ్చిన జోహన్‌బర్గ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని అతని అభిమానులు ఆశలు పెంచుకుంటే, గాయంతో టీమిండియా టెస్టు సారథి పూర్తిగా టెస్టు నుంచే తప్పుకోవడం విశేషం...

విరాట్ కోహ్లీ స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుదిజట్టులో అవకాశం దక్కింది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ స్థానంలో యంగ్ వికెట్ కీపర్ కేల్ వెరెన్నేకి అవకాశం దక్కింది. అలాగే ఆల్‌రౌండర్ ముల్దార్ స్థానంలో డువానే ఓలీవర్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

సౌతాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), అయిడిన్ మార్క్‌రమ్, కీగన్ పీటర్సన్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, తెంబ భవుమా, కేల్ వెరెన్నే, మార్కో జాన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, డువానే ఓలీవర్, లుంగి ఎంగిడి 

భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్