Asianet News TeluguAsianet News Telugu

సిక్స్ ల మోత: విశాఖ టెస్టులో రికార్డులే రికార్డులు

దక్షిణాఫ్రికా, భారత్ మధ్య విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఓ టెస్టు మ్యాచులో అత్యధిక సిక్స్ లు నమోదైన ఘనత కూడా ఈ మ్యాచుకు దక్కుతుంది.

India vs South Africa 1st Match Records Most Sixes In A Test Match Ever
Author
Visakhapatnam, First Published Oct 6, 2019, 5:06 PM IST

విశాఖపట్నం: దక్షిణాఫ్రికా, భారత్ మధ్య విశాఖపట్నంలో జరిగిన టెస్టు మ్యాచులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఓపెనర్ గా తొలి టెస్టు మ్యాచులో రోహిత్ శర్మ రెండు సెంచరీలు సాధించి ఆ ఘనతను సాధించిన ఏకైక బ్యాట్స్ మన్ గా రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. 

ఇదే మ్యాచులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఓ రికార్డును నమోదు చేసుకున్నాడు. 66 టెస్టుల్లో 350 వికెట్లను పడగొట్టి అత్యంత వేగంగా ఆ ఘనతను సాధించిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు. ఇరువురు కలిసి అగ్రస్థానంలో నిలిచారు. 

దక్షిణాఫ్రికా టెయిల్ ఎండర్ పీయుడ్త్ 10వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అర్థ సెంచరీ సాధించడం ద్వారా భారత్ లో టీమిండియాపై దక్షిణాఫ్రికా తరుఫున ఆ ఘనత సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. 

విశాఖపట్నం మ్యాచులో సిక్సర్ల మోత రికార్డు సృష్టించింది. ఈ టెస్టు మ్యాచులో ఇరు జట్లు కలిసి 37 సిక్సర్లు సాధించాయి. దాంతో ఒక టెస్టు మ్యాచులో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన రికార్డును ఇరు జట్లు సొంతం చేసుకున్నాయి. 2014-15 సీజన్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టులో 35 సిక్సర్లు నమోదయ్యాయి. అదే అత్యధిక సిక్సర్ల టెస్టు మ్యాచు కాగా, విశాఖ టెస్టు మ్యాచ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. 

ఇండియా తన తొలి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు సాధించగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో 7 సిక్సర్లు సాధించింది. రెండో ఇన్నింగ్సులో భారత్ 14 సిక్సర్లు కొట్టగా, దక్షిణాఫ్రికా 3 సిక్సర్లను సాధించింది. రవీంద్ర జడేజా వేసిన 35 ఓవరులో పీయడ్త్ సిక్స్ కొట్టి పాకిస్తాన్, న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. చివరలో రబడ మరో సిక్స్ కొట్టి సిక్స్ ల సంఖ్యను 37కు చేర్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios