ఆక్లాండ్: న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ లో అరుదైన ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ మ్యాచులో రెండు జట్ల బ్యాట్స్ మెన్ కూడా బ్యాట్ ను ఝళిపించారు. ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. ముగ్గురు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ యాభైకి పైగా పరుగులు చేశారు. భారత బ్యాట్స్ మెన్ ల్లో ఇద్దరు యాభైకి పైగా పరుగులు సాధించారు. 

న్యూజిలాండ్ ఆటగాళ్లలో మన్రో (59), కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54) అర్త సెంచరీలు చేశారు. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (56), శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్) అర్థ సెంచరీలు సాధించారు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో ఐదుగురు బ్యాట్స్ మెన్ యాభైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. 

Also Read: ముందు రాహుల్, వెనక శ్రేయస్.... కోహ్లీకి రిలీఫ్... ప్రపంచకప్ టీంపై భరోసా

ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టీమిండియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. 

ఇదిలావుంటే, అంతర్జాతీయ టీ20ల్లో 200 పరుగులు, ఆపై లక్ష్యాన్ని అత్యధికమార్లు ఛేదించిన ఘనతను కూడా ఇండియా సాధించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు సార్లు 200, ఆ పై పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండు సార్లు మాత్రమే ఆ ఘనత సాధించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేస్ తలోసారి మాత్రమే ఆ ఘతనను సాధించాయి.

Also Read: బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను రో"హిట్"... కళ్ళు చెదిరే విన్యాసం, వీడియో చూడండి

2009లో శ్రీలంకతో మొహాలీలో జరిగిన టీ20లో భారత్ 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2013లో ఆసీస్ తో రాజ్ కోట్ లో జరిగిన మ్యాచులో 202 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. నిరుడు చివరలో హైదరాబాద్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులో ఇండియా 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా, శుక్రవారం జరిగిన మ్యాచులో కివీస్ పై 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డను నెలకొల్పింది.