ఆక్లాండ్ లో సాగుతున్న భారత్, న్యూజిలాండ్ తొలి టి 20లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రోహిత్ శర్మను మామూలుగా అందరూ ఒక గొప్ప ఓపెనర్ ని మాత్రమే చూస్తారు. కానీ నేటి మ్యాచులో తానెంత అమూల్యమైన ఫీల్డర్ నో కూడా నిరూపించుకున్నాడు హిట్ మాన్. 

శివం దూబే వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి మార్టిన్‌ గప్టిల్‌ డీప్‌ స్వేర్‌ లెగ్‌ వైపుగా భారీ షాట్‌ కొట్టాడు. గ్రౌండ్ చిన్నదవటం వల్ల అందరూ అది సిక్సర్ అని భావించారు. అందునా కొట్టింది ప్రపంచంలోనే ఒక మేటి హార్డ్ హిట్టర్ మార్టిన్ గప్తిల్. 

కాగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ బంతిని ఒడిసి పట్టుకున్న  తీరు ప్రస్తుతం సెన్సేషనల్ గా మారింది. సోషల్ మీడియాలో అది ట్రెండింగ్ గా మారింది. 

బంతి గమనాన్ని, వేగాన్ని  ఖచ్చితంగా అంచనా వేసిన రోహిత్‌.. చాలా కూల్ గా వ్యవహరించాడు. ఇలా క్యాచ్ ను అందుకుంటున్నప్పుడు కొంచం వెనక్కి జరగాల్సి రావడంతో బౌండరీ లైన్ ని తొక్కకుండా జాగ్రత్తపడ్డాడు. 

క్యాచ్ ను అందుకొని బ్యాలన్స్ తప్పి బౌండరీ లైన్ తొక్కుతానేమో అనే అనుమానం రాగానే బాల్ ని మైదానంలోకి మెల్లిగా పైకి విసిరి మల్లి లోపలికి వచ్చి ఆ బంతిని ఒడిసి పట్టాడు. భారత జట్టు ఒక అత్యుత్తమమైన జట్టుగా నిలిచిందంటే... భారత్ అన్ని విభాగాల్లోనూ నాణ్యమైన క్రీడాకారులను తయారుచేస్తుదనడానికి ఇదొక మంచి ఉదాహరణ. 

భారత్, న్యూజీలాండ్ ల మధ్య జరుగుతున్న తొలి టి 20లో న్యూజీలాం 203 పరుగుల భారీ స్కోరును సాధించింది.కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్, మన్రో లు అర్థ సెంచరీలను నమోదు చేసారు. దీన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 

మిచ్ సాంటనర్ వేసిన రెండవ ఓవర్లో మన్రో కి క్యాచ్ ఇచ్చి భారత వైస్ కెప్టెన్ వెనుదిరిగాడు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన కోహ్లీ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఉరుకులెత్తిస్తున్నాడు. ఇరువురూ కూడా గ్రౌండ్ కి నలువైపులా షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 

ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే...  వికెట్లను కోల్పోతున్నప్పటికీ న్యూజీలాండ్ జోరు మాత్రం తగ్గకుండా ఆడింది. డిఫరెంట్ షేప్ కలిగి ఉన్న గ్రౌండ్ ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ, ఎటు కొడితే రన్స్ ఎక్కువగా వస్తాయో చూస్తూ.. యాంగిల్స్ ని కరెక్ట్ గా ఐం చేస్తూ న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. 

19వ ఓవర్లో షమీ కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల పరుగుల వేగానికి ఒకింత బ్రేక్ పడ్డట్టు అనిపించింది. షమీ బౌలింగ్ కి తోడుగా వరుస వికెట్లను కోల్పోవడం న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ స్థైర్యాన్ని ఒకింత మాత్రం దెబ్బకొట్టినట్టు కనబడింది. 18, 19 ఓవర్లలో కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చారు భారత బౌలర్లు. బుమ్రా, షమీలు చాలా జాగ్రత్తగా బంతులు వేసి వారిని పూర్తిగా కట్టడి చేసారు. 

చివరి 20వ ఓవర్ లో బౌలింగ్ వేస్తూ బుమ్రా ఒకింత ఇబ్బందిపడ్డారు. ఆఖరి ఓవర్లో రెండవ బంతిని వేసి రన్ అప్ పూర్తి చేస్తూ ఒక్కసారిగా కూర్చుండిపోయాడు. నొప్పితో విలవిల్లాడుతున్న బుమ్రాను పరీక్షించిన ఫీజియో పర్లేదు అని చెప్పడంతో బౌలింగ్ కొనసాగించాడు. ఆఖ్ఖరు ఓవర్లో మూడవ బంతికి రాస్ టేలర్ తన తొలి టి 20 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.