Asianet News TeluguAsianet News Telugu

Ind vs Nz: గాయాలతో రహానే, జడేజా, ఇషాంత్ ఔట్.. కివీస్ నుంచి కేన్ మామా డౌటే.. టాస్ ఆలస్యం.. మ్యాచ్ సాగేనా..?

India Vs New Zealand: ముంబై వేదికగా నేటి నుంచి ప్రారంభం కావాల్సిన  ఇండియా-న్యూజిలాండ్ రెండో టెస్టు జరిగేది అనుమానంగానే ఉంది. రెండు జట్లలోని కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడ్డారు. ఇంకా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కు కూడా రాలేదు. 

India Vs New Zealand: Toss Delayed Due To wet Outfield, Umpires To Inspection pitch
Author
Hyderabad, First Published Dec 3, 2021, 9:19 AM IST

ఇండియా-న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా నేటి నుంచి మొదలుకావల్సి ఉన్న  రెండో టెస్టు ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. గత నాలుగు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలతో ఔట్ ఫీల్డ్ అంతా తడిగా మారింది. దీంతో శుక్రవారం ఉదయం ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కు కూడా రాలేదు.  ఉదయం తొమ్మిది గంటలకు టాస్  ప్రారంభం కావల్సి ఉన్నా పిచ్ పై తేమ, వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడంతో టాస్ ఆలస్యమైంది. ఇక గాయాల కారణంగా ఇరు జట్ల నుంచి కీలక ఆటగాళ్లు ఈ టెస్టుకు దూరమయ్యారు. టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, అజింకా రహానే లు రెండో టెస్టు ఆడటం లేదు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఆడేది అనుమానమే.. 

ఉదయం 10.30 గంటలకు అంపైర్లు వచ్చి పిచ్ ను పరిశీలించిన తర్వాత  కెప్టెన్లను టాస్ కు పిలవాలా..? లేదా..? మ్యాచ్ ను కొనసాగించాలా..? వద్దా..? అనే విషయాలపై స్పష్టత రానుంది. 

అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా ముంబై లో  అక్కడక్కడా వర్షం కురుస్తుంది. అయితే  వాంఖడే స్టేడియం సమీపంలో రెండ్రోజుల నుంచి వర్షం లేకున్నా.. ఎండ లేకపోవడంతో పిచ్ అంతా తేమతో నిండిఉంది.  దీంతో పిచ్ ను కూడా కవర్లతో కప్పి ఉంచారు. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కూడా ముంబైలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ నేపథ్యంలో ముంబై టెస్టు  జరగడం అనుమానాస్పదంగానే ఉంది. 

 

విరాట్ కోహ్లీ పునరాగమనంతో బలంగా కనిపిస్తున్న భారత జట్టు.. ఈ టెస్టులో నెగ్గి సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. తొలి టెస్టులో విజయం అంచులదాకా వచ్చిన టీమిండియా.. ఒక్క వికెట్ పడగొట్టలేక  డ్రా తో సరిపెట్టుకుంది. కానీ ఈ టెస్టులో మాత్రం కివీస్ కు ఆ అవకాశమివ్వకూడదని భావిస్తున్నది. ఈ మేరకు ముంబై పిచ్ ను కూడా స్పిన్నర్లకు అనుకూలించేలా తయారుచేశారని సమాచారం.  ఇక భారత జట్టుకు కూర్పు ప్రధాన సమస్యగా ఉంది.  దీనిపై సెలెక్షన్ కమిటీ తర్జన భర్జన పడుతున్నది.

 

రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా ఔట్.. 

గాయాల కారణంగా రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు రెండో టెస్టుకు దూరమయ్యారు. వేలికి గాయం కావడంతో ఇషాంత్ శర్మ, కుడి మోచేతికి గాయంతో రవీంద్ర జడేజా.. కాన్పూర్ లో ఫీల్డింగ్ చేస్తుండగా రహానేకు గాయమైంది. దీంతో ఈ ముగ్గురు రెండో టెస్టు నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో ఎవర్ని భర్తీ చేయనున్నారనేది కాసేపట్లో తెలియనుంది.

కేన్ విలియమ్సన్ డౌటే..? 

ముంబై టెస్టుకు ముందు కివీస్ కు భారీ షాక్..? ఆ జట్టు  కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ టెస్టులో ఆడేది అనుమానంగానే ఉంది. భుజం నొప్పి గాయంతో బాధపడుతున్న విలియమ్సన్..  భారత్ తో జరిగిన టీ20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. కానీ కాన్పూర్ టెస్టులో ఆడాడు. అయితే గాయం మళ్లీ తిరగబెట్టడంతో అతడు  ముంబై టెస్టు ఆడేది అనుమానమేనని న్యూజిలాండ్ జట్టు వర్గాలు చెబుతున్నాయి. కేన్ విలియమ్సన్ స్థానంలో డారిల్ మిచెల్ ను ఆడించే అవకాశముంది. 

మరోవైపు ఇంతవరకు భారత్ లో భారత్ ను ఓడించని  న్యూజిలాండ్.. ఈ టెస్టులో టీమిండియాను ఓడించి  సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నది.  గత 10 మ్యాచుల్లో న్యూజిలాండ్ ఒక్క టెస్టులో కూడా ఓడలేదు. 8 గెలిచి, రెండు డ్రా చేసుకుంది. ఇక న్యూజిలాండ్ భారత్ లో చివరగా గెలిచిన  టెస్టు మ్యాచ్ కూడా ముంబైలోనే. 1988లో ఆ జట్టు భారత్ ను ఓడించింది ఇక్కడే. ఆ తర్వాత మళ్లీ ఆ జట్టు భారత్ ను భారత్ లో ఓడించలేదు. 

ఇక 2016 తర్వాత ఈ పిచ్ పై టెస్టు మ్యాచ్ జరుగడం ఇదే ప్రథమం. చివరిసారి ఇక్కడ 2016 డిసెంబర్ 8-12 మధ్య భారత్.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడింది. ఆ టెస్టులో  ఇండియా 36 పరుగుల తేడాతో గెలిచింది. ఆ టెస్టులో విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios