Asianet News TeluguAsianet News Telugu

Ind vs Nz: క్లీన్ స్వీప్ పై కన్నేసిన రోహిత్ సేన? ప్రయోగాలకు ఛాన్స్.. ఇండియన్ లార్డ్స్ లో కివీస్ తో ఆఖరి టీ20

India Vs New Zealand T20I: భారత లార్డ్స్ గా పిలిచే ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ లో నేడు ఇండియా-న్యూజిలాండ్ మూడో టీ20 లో తలపడనున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత టీ20 సారథి రోహిత్ శర్మ ప్రయోగాలు చేయనున్నాడు.

India Vs New Zealand T20I: Rohit Sharma Led Team India aims Clean Sweep at Eden Gardens Today, avesh Khan To make India debut
Author
Hyderabad, First Published Nov 21, 2021, 11:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీమిండియా క్రికెట్ అభిమానులకు టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గాయాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న భారత క్రికెట్ జట్టు.. నేడు ఆ దిశగా మరో ప్రయత్నం చేయనున్నది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ (New Zealand) తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న ఇండియా (India).. ఇప్పటికే రెండింటిలో నెగ్గి సిరీస్ ను సొంతం చేసుకుంది. సిరీస్ లో భాగంగా ఆఖరుదైన మూడో టీ20  నేడు కోల్కతా వేదికగా జరుగనున్నది. భారత లార్డ్స్ గా పిలిచే ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ (Eden Garden) లో నేడు ఇండియా-న్యూజిలాండ్ (Ind vs Nz) మూడో టీ20 లో తలపడనున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రయోగాలు చేయనున్నాడు. ఈ మ్యాచులో కెఎల్ రాహుల్ (KL Rahul) తో పాటు మరో ఇద్దరికీ విశ్రాంతినివ్వాలని టీమిండియా (Team India) భావిస్తున్నది. మరోవైపు ఈ మ్యాచ్ లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని కివీస్ ఆరాటపడుతున్నది. 

జైపూర్ తో పాటు రాంచీ టీ20లో నెగ్గిన టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నది. బ్యాటింగ్ లో కెఎల్ రాహుల్-రోహిత్ శర్మ జోడీ సూపర్ ఫామ్ లో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ బదులు ఐపీఎల్ లో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ను ఆడించే అవకాశముంది. రుతురాజ్.. ఈ ఏడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన ధావన్ నేతృత్వంలోని జట్టులో రెండు మ్యాచులాడినా.. అక్కడ పెద్దగా మెరవలేదు. కానీ ఐపీఎల్ (IPL) లో మాత్రం గొప్పగా రాణించడంతో సెలక్టర్లు మళ్లీ అతడిని జట్టులోకి పిలిచారు. ఇక  మొన్నటి మ్యాచ్ లో వన్ డౌన్ లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది.  ఆల్ రౌండర్ కోటాలో టీమ్ లోకి అడగుపెట్టిన అయ్యర్ ను రోహిత్ నేటి మ్యాచులో బౌలింగ్ కు కూడా దించే అవకాశముంది. ఇక  సూర్య కుమార్ యాదవ్,  రిషభ్ పంత్ లతో కూడా మిడిలార్డర్ పటిష్టంగానే ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫామ్ అందుకోలేదు. 

బౌలింగ్ లో భారత్ బాగానే రాణిస్తున్నది.  కానీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో పేసర్లు భారీగా పరుగులిచ్చుకుంటుండం ఆందోళన కలిగించే అంశమే. అయితే ఈ మ్యాచ్ లో భువనేశ్వర్, దీపక్ చాహర్ లో ఎవరికైనా ఒక్కరికి విశ్రాంతినిచ్చి ఆ స్థానంలో అవేశ్  ఖాన్  (Avesh Khan)ను ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే అశ్విన్, అక్షర్ లలో కూడా ఒకరికి రెస్ట్ ఇచ్చి యుజ్వేంద్ర చాహల్ ను ఆడించనున్నట్టు సమాచారం. 

పరువు కోసం కివీస్.. 

ప్రపంచకప్ ఫైనల్ లో ఓడి.. దుబాయ్ నుంచి నేరుగా ఇండియాకు వచ్చిన న్యూజిలాండ్ కు ఈ సిరీస్ ఓడటం పుండు మీద కారం చల్లినట్టే. ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్,  డావెన్ కాన్వేల గైర్హాజరీలో కివీస్ మిడిలార్డర్ దారుణంగా విఫలమవుతున్నది. బ్యాటింగ్ లో గప్తిల్, చాప్మన్ లు రాణిస్తున్నా తర్వాత వచ్చే బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఇన్నింగ్స్ ను గొప్పగా ఆరంభిస్తున్న కివీస్.. అంతే గొప్ప ముగింపు ఇవ్వలేకపోతున్నది. గత రెండు మ్యాచుల్లోనూ ఆ లోపం కివీస్ ను దారుణంగా దెబ్బతీసింది. భారీ  హిట్టర్లున్న ఆ జట్టుకు  డెత్ ఓవర్లలో పరుగులు చేయడం కష్టంగా మారింది. ఫిలిప్స్, సీఫర్ట్, నీషమ్ లు భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. 

బౌలింగ్ లో ప్రపంచ స్థాయి ద్వయం  ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ (Tim Southee) లు ఉన్నా వారిద్దరూ  ఈ సిరీస్ లో తేలిపోయారు. ఓపెనర్లు రోహిత్-రాహుల్ లు వారిద్దరినీ చెడుగుడు ఆడుకుంటున్నారు. మిల్నె, శాంట్నర్, సోధి కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. నేటి  మ్యాచ్ లో అయినా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. విజయాన్ని అందించాలని ఆ జాట్టు కోరుకుంటున్నది. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే సౌథీ సేన బరిలోకి దిగనున్నది. 

పిచ్ : 

ఈడెన్ గార్డెన్ బ్యాటింగ్ కు స్వర్గధామం. స్పిన్ కు బాగా అనుకూలిస్తుంది. మంచు ప్రభావం అధికంగా ఉంటుండటంతో గత రెండు మ్యాచుల్లాగే నేటి పోరులో కూడా టాస్ గెలిచిన జట్టు మరో ఆప్షన్ లేకుండా బౌలింగ్ ఎంచుకునే అవకాశమే ఎక్కువ. ఈ గ్రౌండ్ లో  ఇండియా నాలుగు టీ20 లు ఆడింది. అందులో రెండు గెలవగా.. ఒకటి ఓడింది. ఒకటి రద్దైంది. ఇక ఇండియా-న్యూజిలాండ్ లు ఇప్పటివరకు 19 మ్యాచులలో పోటీపడగా.. భారత్ 10 గెలిచింది. కివీస్ 9 విజయాలు సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios