Asianet News TeluguAsianet News Telugu

Ind Vs Nz: రాంచీలో ముగిస్తారా..? కోల్కతాకు తీసుకెళ్తారా..? ఇండియా-కివీస్ మధ్య నేడే కీలక రెండో టీ20

India Vs New Zealand T20I: ఈ మ్యాచ్ లోనే గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే  సిరీస్ గెలుచుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది.  ఈ మ్యాచ్ గెలిస్తే రోహిత్-ద్రావిడ్ ద్వయం తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసినట్టే..

India Vs New Zealand T20I: Rohit Sharma Led Team India Aim to bag series against kiwis
Author
Hyderabad, First Published Nov 19, 2021, 3:37 PM IST

టీ20 ప్రపంచకప్ పరాభావం నుంచి వీలున్నంత త్వరగా బయటపడాలని ఆరాటపడుతున్న టీమిండియా నేడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్ లో ఇండియాను సెమీస్ చేరకుండా అడ్డుకున్న న్యూజిలాండ్ పని పట్టడానికి భారత్ కు చక్కటి అవకాశం. ఇరు జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో నేడు రెండో పొట్టి పోరు జరుగనున్నది. ఈ మేరకు ఇప్పటికే ఇరు జట్లు మ్యాచ్ జరిగే  రాంచీకి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లోనే గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే  సిరీస్ గెలుచుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. కొత్త కోచ్ తో పాటు కొత్త  సారథి సారథ్యంలో సాగుతున్న టీమిండియా.. రాంచీలోనే కివీస్ పనిపట్టి కోల్కతా మ్యాచ్ ను నామమాత్రపు పోరుగా మార్చేయాలని చూస్తున్నది. రాంచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ 7 గంటలకు మొదలుకానున్నది. 

న్యూజిలాండ్ తో జైపూర్ లో జరిగిన తొలి మ్యాచ్  లో వచ్చిన విజయంతో జోరు మీదున్న టీమిండియా.. రాంచీలో కూడా అదరగొట్టాలని అనుకుంటున్నది. ప్రపంచకప్ పరాభావం నుంచి కోలుకోవడానికి టీమిండియాకు ఇదో సదావకాశం. ఇక ఈ మ్యాచులో మరో ఐపీఎల్ హీరో అరంగ్రేటం చేసే అవకాశముంది. తొలి మ్యాచ్ లో సిరాజ్ చేతికి గాయమైంది. వచ్చే టెస్టు సిరీస్ నేపథ్యంలో అతడికి విశ్రాంతినివ్వనున్నారు. బ్యాటింగ్ లో రోహిత్, కెఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నా.. వన్ డౌన్ లో వచ్చి సూర్యకుమార్ యాదవ్ నిరూపించుకున్నా శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. పంత్ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. 

వెంకటేష్ ను ఉపయోగించుకుంటారా..? 

ఆల్ రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించుకున్న వెంకటేష్ అయ్యర్ కు తొలి  మ్యాచ్ లో బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. దీనిపై టీమిండియా సీనియర్లు సైతం రోహిత్ నిర్ణయంపై ప్రశ్నలు గుప్పించారు. మరి ఈ మ్యాచులో అయినా అయ్యర్ కు బంతినిస్తారా...? లేదా..? అనేది చూడాలి. మరోవైపు గత మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన అయ్యర్.. రెండు బంతులే ఆడాడు. ఈ మ్యాచ్ లో అయినా పూర్తిస్థాయి బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుందా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది. 

ఆ ఇద్దర్లో ఒకరికి ఛాన్స్..? 

గత మ్యాచ్ లో భారత్ తరఫున బరిలోకి దిగిన మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, అక్షర్ లు భారీగా పరుగులిచ్చారు. సిరాజ్ కు గాయమైంది.  అక్షర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే వీరిద్దరూ ఈ మ్యాచ్ లో ఆడటం సందేహమే. ఒకవేళ ఇద్దరికి విశ్రాంతినిస్తే యువ బౌలర్లలో అవేశ్ ఖాన్ గానీ.. హర్షల్ పటేల్ గానీ అరంగ్రేటం చేసే అవకాశముంది. 

New Zealand నిలువరిస్తుందా..? 

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన కివీస్.. ఫైనల్లో బోల్తా కొట్టింది. ఫైనల్ ముగిసిన వెంటనే భారత్ కు వచ్చిన  న్యూజిలాండ్.. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్ లోనూ ఓడిపోయింది. ఓపెనర్లు గప్తిల్,  వన్ డౌన్ లో వచ్చిన చాప్మన్ రాణించినా ఆఖర్లో  తడబడిన ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. ఇదే ఆ జట్టును పెద్ద దెబ్బ తీసింది.  ఇక బౌలింగ్ లో కూడా ఆ జట్టు బౌలర్లు తేలిపోయారు. ప్రపంచ స్థాయి  బౌలర్లైన సీమ్ ద్వయం సౌథీ, బౌల్ట్ లు భారీగా పరుగులిచ్చుకున్నారు.  స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.  ఈ నేపథ్యంలో కివీస్ జట్టులో కూడా రెండు మార్పులు జరిగే అవకాశముంది. తొలి మ్యాచ్ లో అంతరగా రాణించని రచిన్ రవీంద్ర, టాడ్ ఆస్టిల్  స్థానంలో.. జిమ్మీ నీషమ్,  స్పిన్నర్ ఇష్ సోధి జట్టులోకి చేరొచ్చు.  ఇక ఈ మ్యాచ్ లో భారత్ ను నిలువరించి సిరీస్ ను సమం చేయాలని సౌథీ సేన భావిస్తున్నది. 

పిచ్ పరిస్థితి..? 

జార్ఖండ్ రాజధాని రాంచీలోని జేఎస్సీఏ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించేది. స్పిన్నర్లకూ సహకరిస్తుంది. మ్యాచ్ పై మంచు ప్రభావం సుస్పష్టం. టాస్ గెలిచిన జట్టు ఛేదన వైపునకే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు భారత్ 2 టీ20లు ఆడింది.  ఆ రెండింటిలోనూ భారత్  దే విజయం. ఇదిలాఉండగా... ఈ మ్యాచ్ కోసం వంద శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. కాగా..  టీ20 లో రవిచంద్రన్ అశ్విన్ ఉత్తమ ప్రదర్శన.. 3-14 (శ్రీలంక మీద) ఈ గ్రౌండ్ మీదే నమోదు చేశాడు.

ఇక ఇప్పటివరకు ఇండియా-న్యూజిలాండ్ మధ్య 18 టీ20  మ్యాచులు జరిగాయి. ఇందులో ఇండియా 7 గెలువగా.. న్యూజిలాండ్ 9 నెగ్గింది. 2 టై అయ్యాయి. అయితే ఈ రెండింటిలో  సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రాగా.. ఆ రెండూ ఇండియానే నెగ్గింది.  

అరుదైన రికార్డుకు చేరువలో గప్తిల్.. 

ఈ మ్యాచ్ లో 11 పరుగులు చేస్తే న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ అరుదైన రికార్డు సృష్టిస్తాడు. 11 పరుగులు గనక సాధిస్తే..  టీ20లలో విరాట్ కోహ్లి (3,227 పరుగులు) ని అధిగమిస్తాడు. విరాట్.. 95 టీ20లలో 3,227 పరుగులు చేయగా.. గప్తిల్ 110 మ్యాచులలో 3,217 పరుగులు చేశాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios