Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st Test: తిప్పేసిన అక్షర్ పటేల్... తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి స్వల్ప ఆధిక్యం..

కాన్పూర్ టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకి న్యూజిలాండ్ ఆలౌట్... భారత జట్టుకి 49 పరుగుల స్వల్ప ఆధిక్యం... ఐదు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, అశ్విన్‌కి మూడు వికెట్లు...

India vs New Zealand: New Zealand team all-out in first Innings, Team India gets lead, Axar patel picks
Author
India, First Published Nov 27, 2021, 3:59 PM IST

కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒకనొక దశలో 151/0 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించిన కివీస్ టీమ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ కారణంగా వరుస వికెట్లు కోల్పోయింది... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 129/0 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు, 66.1 ఓవర్ల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

ఇదీ చదవండి: యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్‌ కప్‌లో ప్లేస్ కోల్పోయిన ఎమ్మెస్ ధోనీ... 

మొదటి వికెట్‌కి 151 పరుగులు జోడించిన తర్వాత విల్ యంగ్ అవుట్ అయ్యాడు. 214 బంతుల్లో 15 ఫోర్లతో 89 పరుగులు చేసిన విల్ యంగ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత టామ్ లాథమ్‌తో కలిసి రెండో వికెట్‌కి 46 పరుగులు జోడించాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్. 64 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ని ఉమేశ్ యాదవ్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు...

 మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 197 పరుగులు చేసింది... మొదటి సెషన్ తర్వాత అక్షర్ పటేల్ మ్యాజిక్ మొదలైంది.  28 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన రాస్ టేలర్‌, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత 2 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అక్షర్ పటేల్, 94 బంతుల్లో 13 పరుగులు చేసిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌ను క్లీన్‌ బౌల్డ్ చేశాడు...

282 బంతుల్లో 10 ఫోర్లతో 95 పరుగులు చేసిన ఓపెనర్ టామ్ లాథమ్, అక్షర్ పటేల్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ముందుకొచ్చి స్టంపౌట్ అయ్యాడు. వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన శ్రీకర్ భరత్, మెరుపు వేగంతో బంతిని అందుకుని, స్టంపౌట్ చేయడంతో సెంచరీకి 5 పరుగుల దూరంలో నిరాశగా వెనుదిరిగాడు లాథమ్...

23 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన రచిన్ రవీంద్రను రవీంద్ర జడేజా క్లీన్‌బౌల్డ్ చేయగా, 5 పరుగులు చేసిన టిమ్ సౌథీ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

Read also: రాహుల్, మయాంక్, క్రిస్ గేల్, మహ్మద్ షమీ... ఎవ్వరూ వద్దు, అందరూ వేలానికే... పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం...

కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్‌, ఐదు వికెట్లు తీయడం (ఏడు ఇన్నింగ్స్‌ల్లో) ఇది ఐదోసారి. చార్లీ టర్నర్ (ఆరు సార్లు) తర్వాత మొదటి నాలుగు టెస్టుల్లో అత్యధిక సార్లు  ఐదేసి వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు అక్షర్ పటేల్. 

75 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన కేల్ జెమ్మీసన్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు జెమ్మీసన్... సోమర్ విల్లేని అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీయగా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకి వికెట్ దక్కలేదు...
 

Follow Us:
Download App:
  • android
  • ios