Ind Vs Nz: ఇటీవలే ఇండియా హెడ్ కోచ్ గా నియమితుడైన ద్రావిడ్, కొత్త సారథి రోహిత్ శర్మ లు అద్భుతాలు సృష్టించగలరని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ద్రావిడ్ పనితీరు గురించి ఇప్పుడే మాట్లాడటం సరైంది కాదని టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ అన్నాడు.
టీమిండియాకు హెడ్ కోచ్ గా నియమితుడైన రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పనితీరు గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. భారత జట్టుకు ప్రధాన శిక్షకుడి (Team India Head coach)గా నియమితుడు కాకముందు అతడు ఇండియా అండర్-19, ఇండియా-ఎ జట్లకు అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) లో అయితే ద్రావిడ్ తనదైన ముద్ర వేశాడు. అయితే ఇటీవలే ఇండియా (India) హెడ్ కోచ్ గా నియమితుడైన ద్రావిడ్ పనితీరు గురించి ఇప్పుడే మాట్లాడటం సరైంది కాదని టీమిండియా (Team India) స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravi Chandran Ashwin) అన్నాడు.
బుధవారం న్యూజిలాండ్ (New Zealand) తో మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ మాట్లాడుతూ.. ‘రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే మాట్లాడటం సబబు కాదు. ఇండియా అండర్-19 జట్టుకు శిక్షకుడిగా అతడు కొన్ని ప్రమాణాలు నెలకొల్పి వచ్చాడు. అతడు (ద్రావిడ్) అవకాశాలను వదిలిపెట్టడు. మ్యాచ్ కు ముందు ప్రణాళికలు, సన్నద్ధతతో ఉంటాడు. ద్రావిడ్ రాకతో డ్రెస్సింగ్ రూమ్ లో మళ్లీ సంతోషాలను తీసుకొచ్చాడు..’ అని అన్నాడు.
భారత జట్టుకు ఐదేండ్ల పాటు కోచ్ గా సేవలందించిన రవిశాస్త్రి (Ravi Shastri) పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ద్రావిడ్ హెడ్ కోచ్ గా నియమితుడైన విషయం తెలిసిందే. ఇండియా కోచ్ గా ద్రావిడ్ కు ఇదే తొలి సవాల్. ద్రావిడ్ తో పాటు రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా పూర్తి స్థాయి సారథిగా నియమితుడైన తొలి మ్యాచ్ లోనే విజయం సాధించాడు. ప్రశాంతంగా పని పూర్తి చేసుకునే వీళ్లిద్దరూ భారత జట్టుకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఐసీసీ (ICC) ట్రోఫీలను అందిస్తారని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
నేను అదే చేశాను..
ఇక నిన్నటి మ్యాచ్ లో తన బౌలింగ్ గురించి కూడా అశ్విన్ స్పందించాడు. అశ్విన్ మాట్లాడుతూ.. ‘పిచ్ బాగుంది. ఎంత నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అంత బాగా స్పందించింది. సీమ్ ను నమ్ముకుంటే లాభం లేదని నాకు తొలి పవర్ ప్లే లోనే అర్థమైంది. రెండో ఇన్నింగ్స్ లో శాంట్నర్ అదే పని చేసి బోల్తా కొట్టాడు. అందుకే నేను లెంగ్త్ ను మిస్ చేయకుండా పక్కా లైన్ మీదే బంతులు విసిరాను.. అందుకే చివరి ఓవర్లో ఫలితం రాబట్టాను..’ అని వ్యాఖ్యానించాడు.
మేం వేరే అనుకున్నాం..
పవర్ ప్లే లో బౌలింగ్ చేసినప్పుడు పిచ్ పై పేస్ ను గుర్తించడానికి కాస్త సమయం పట్టిందన్న అశ్విన్.. గుర్తించిన తర్వాత దానికి తగ్గట్టుగ తాను బంతులు విసిరానని చెప్పుకొచ్చాడు. కివీస్ ఆటగాళ్ల ఆటను బట్టి చూస్తే వాళ్లు 170-180 పరుగులు చేయగలరని భావించామని, కానీ ఇది టీ20 క్రికెట్ అని ఇందులో ఏదైనా క్షణాల్లోనే మారిపోయే అవకాశముందని తెలిపాడు. అశ్విన్ చెప్పినట్టు.. 17వ ఓవర్ దాకా వీరవిహారం చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. ఆఖరు 2 ఓవర్లలో 11 పరుగులే చేయడం గమనార్హం. ఇక భారత ఇన్నింగ్స్ లో కూడా సూర్య కుమార్ జోరు చూసిన వాళ్లెవరైనా అతడు ఔటైనా ఇండియా ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివరి ఓవర్ దాకా ఉత్కంఠ వీడలేదు. టీ20 క్రికెట్ లో ఉండే మజానే అది..
