Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd test: తిప్పేసిన అజాజ్ పటేల్... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

ముంబై టెస్టులో రెండో రోజు టీమిండియాకి దక్కని శుభారంభం... వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు... ఆరుకి ఆరు వికెట్లు తీసిన అజాజ్ పటేల్..

India vs New Zealand: Ajaz patel picks two wickets in consecutive balls, Ravichandran Ashwi, W Saha
Author
India, First Published Dec 4, 2021, 9:47 AM IST

ముంబై టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టిన అజాజ్ పటేల్, రెండో రోజు కూడా తన ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 

62 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అజాజ్ పటేల్, ఆ తర్వాతి బంతికే రవిచంద్రన్ అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం అజాజ్ పటేల్‌కి ఇది మూడో సారి. 

శ్రీలంక పర్యటనలో ఐదు వికెట్లు తీసిన అజాజ్ పటేల్, ఆ తర్వాత యూఏఈలో పాకిస్తాన్‌పై ఐదు వికెట్లు తీశాడు. తాజాగా భారత పర్యటనలోనూ సొంత గడ్డపై ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు అజాజ్ పటేల్...

ఇదీ చదవండి: ఇదేం చెత్త అంపైరింగ్, బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించినా... విరాట్ కోహ్లీ అవుట్‌పై వివాదం...

భారత జట్టు కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అజాజ్ పటేల్‌కే దక్కడం మరో విశేషం. ఆసియాలో అత్యధిక సార్లు ఐదేసి వికెట్లు తీసిన మూడో కివీస్ బౌలర్‌గా నిలిచాడు అజాజ్ పటేల్. కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ 21 టెస్టుల్లో 8సారి ఈ ఫీట్ సాధించగా, సర్ రిచర్డ్ హార్డ్‌లీ 13 టెస్టుల్లో 5 సార్లు, టిమ్ సౌథీ 13 టెస్టుల్లో మూడుసార్లు ఈ ఫీట్ సాధించారు. అజాజ్ పటేల్ 7 టెస్టుల్లో మూడు సార్లు ఈ ఫీట్ సాధించడం  విశేషం. 

భారత బ్యాట్స్‌మెన్‌లో ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కాగా.. ఈ ముగ్గురికీ న్యూజిలాండ్‌పై ఇదే మొదటి డకౌట్. ఇండియాలో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన న్యూజిలాండ్ స్పిన్నర్‌గానూ అజాజ్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ ఇప్పటికే 6 వికెట్లు తీయగా, 2012లో జీతన్ పటేల్ తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శనే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది...

అతి పెద్ద వయసులో ఇండియాలో ఐదు వికెట్లు తీసిన రెండో పర్యాటక స్పిన్నర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజాజ్ పటేల్. ఇక్బాల్ ఖాసీం 33 ఏళ్ల 219 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించగా, అజాజ్ పటేల్ వయసు 33 ఏళ్ల 43 రోజులు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత జట్టు.  ఆరంభం నుంచి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 71 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా ఐదు బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండా అజాజ్ పటేల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ కూడా అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు...

Read Also: ఆ సమయంలో విరాట్ కోహ్లీతో ఆ అంపైర్‌కి గొడవలు... ఆ పగతోనే అవుట్ ఇచ్చాడా...

 41 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఓ బౌండరీ బాదిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాతి బంతికి కూడా అదే మాదిరి షాట్‌కి ప్రయత్నించి, కీపర్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

160 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో మయాంక్ అగర్వాల్ మాత్రం దూకుడు తగ్గించకుండా బౌండరీలు బాదుతూ న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. టెస్టు ఓపెనర్‌గా అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు మయాంక్ అగర్వాల్...

Follow Us:
Download App:
  • android
  • ios