Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd Test: టీమిండియా ఆలౌట్... 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్‌...

తొలి ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్... 325 పరుగులకి టీమిండియా ఆలౌట్...

India vs New Zealand: Ajaz Patel breaks Anil Kumble Records, pics 10 wickets in an Innings
Author
India, First Published Dec 4, 2021, 1:05 PM IST

సొంత గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌ తరుపున ఆడుతున్న అజాజ్ పటేల్, అద్భుతం చేశాడు. ముంబై టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి, పదికి పది వికెట్లు పడగొట్టాడు.  ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, 325 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 
రెండో రోజు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే  వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకి షాక్ ఇచ్చాడు అజాజ్ పటేల్. అయితే మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ కుదురుకోవడంతో 300+ స్కోరును దాటగలిగింది భారత జట్టు...

62 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అజాజ్ పటేల్, ఆ తర్వాతి బంతికే రవిచంద్రన్ అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

224 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు...

311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 150 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరడం విశేషం...

మయాంక్ అగర్వాల్‌కి ఇది మూడో 150+ స్కోరు కాగా, టీమిండియా టెస్టు ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ (8 సార్లు), సునీల్ గవాస్కర్ (6 సార్లు) మాత్రమే మయాంక్ అగర్వాల్ కంటే ముందున్నారు.

26 ఇన్నింగ్స్‌ల్లో 3వ సారి 150+ స్కోరు నమోదు చేసిన మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా (4 సార్లు) తర్వాతి స్తానంలో నిలిచాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మయాంక్ అగర్వాల్‌కి ఇది మూడో 150+ స్కోరు. జో రూట్ ఒక్కడే (4 సార్లు), మయాంక్ కంటే ముందున్నాడు. 

ఒకే ఇన్నింగ్స్‌లో ఐదుకి పైగా వికెట్లు తీయడం అజాజ్ పటేల్‌కి ఇది మూడో సారి. శ్రీలంక పర్యటనలో ఐదు వికెట్లు తీసిన అజాజ్ పటేల్, ఆ తర్వాత యూఏఈలో పాకిస్తాన్‌పై ఐదు వికెట్లు తీశాడు. తాజాగా భారత పర్యటనలోనూ సొంత గడ్డపై 5+ వికెట్లు తీసి అదరగొట్టాడు అజాజ్ పటేల్...

 ఆసియాలో అత్యధిక సార్లు ఐదేసి వికెట్లు తీసిన మూడో కివీస్ బౌలర్‌గా నిలిచాడు అజాజ్ పటేల్. కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ 21 టెస్టుల్లో 8సారి ఈ ఫీట్ సాధించగా, సర్ రిచర్డ్ హార్డ్‌లీ 13 టెస్టుల్లో 5 సార్లు, టిమ్ సౌథీ 13 టెస్టుల్లో మూడుసార్లు ఈ ఫీట్ సాధించారు. అజాజ్ పటేల్ 7 టెస్టుల్లో మూడు సార్లు ఈ ఫీట్ సాధించడం  విశేషం. 

భారత బ్యాట్స్‌మెన్‌లో ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కాగా.. ఈ ముగ్గురికీ న్యూజిలాండ్‌పై ఇదే మొదటి డకౌట్. ఇండియాలో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన న్యూజిలాండ్ స్పిన్నర్‌గానూ అజాజ్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు. 

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత దూకుడు పెంచిన అక్షర్ పటేల్, 113 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్‌కి ఇది మొట్టమొదటి హాఫ్ సెంచరీ...

128 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.... ఆ తర్వాత జయంత్ యాదవ్ 31 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 

ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ 3 బంతుల్లో ఓ ఫోర్ బాది, అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  జిమ్ లాకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజాజ్ పటేల్. 

న్యూజిలాండ్‌ తరుపున ఆస్ట్రేలియాపై 9 వికెట్లు తీసిన రిచర్డ్ హార్డ్‌లే ప్రదర్శనే ఇప్పటిదాకా అత్యుత్తమ పర్ఫామెన్స్‌గా ఉండగా, అజాజ్ పటేల్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. 1956లో ఆస్ట్రేలియాలపై జిమ్ లాకర్, 1999లో పాకిస్తాన్‌పై అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయగా, భారత్‌పై ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా అజాజ్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios