Asianet News TeluguAsianet News Telugu

ఆఖరి వన్డేనీ విడువని వరుణుడు... న్యూజిలాండ్‌కి అనుకూలంగా డీఆర్‌ఎస్! సిరీస్ పోయినట్టేనా...

వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసిన న్యూజిలాండ్... హాఫ్ సెంచరీ చేసి అవుటైన ఫిన్ ఆలెన్... 

India vs New Zealand 3rd ODI Rain stops play, DLS method favor to New Zealand
Author
First Published Nov 30, 2022, 1:48 PM IST

న్యూజిలాండ్‌ పర్యటనలో వర్షం కారణంగా లక్ కలిసి వచ్చి 1-0 తేడాతో టీ20 సిరీస్ నెగ్గింది టీమిండియా. అయితే వన్డే సిరీస్‌లో ఇదే వర్షం టీమిండియాకి శాపంగా మారింది. రెండో వన్డే వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారింది...

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 219 పరుగులకి ఆలౌట్ కాగా 220 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్... 18 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయానికి 116 పరుగులు మాత్రమే కావాలి. వర్షం ఆగి, మ్యాచ్ తిరిగి ప్రారంభం కాకపోతే డీఎల్‌ఎస్ విధానం ప్రకారం న్యూజిలాండ్‌ ఆఖరి వన్డేలో విజేతగా నిలుస్తుంది.

డక్త్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 18 ఓవర్లు ముగిసే సమయానికి 54 పరుగులు చేస్తే చాలు. దానికి 50 పరుగులు ఎక్కువగా చేసిన న్యూజిలాండ్, 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే కలిసి తొలి వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం అందించారు. 54 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన ఫిన్ ఆలెన్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. డివాన్ కాన్వే 51 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియంసన్ 3 బంతులాడి పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు,  47.3 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శుబ్‌మన్ గిల్ 22 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

16 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన రిషబ్ పంత్, డార్ల్ మిచెల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

59 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. 25 బంతుల్లో 12 పరుగులు చేసిన దీపక్ హుడా, టిమ్ సౌథీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న న్యూజిలాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. 9 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసిన దీపక్ చాహార్, డార్ల్ మిచెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. యజ్వేంద్ర చాహాల్ 22 బంతుల్లో 8 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన అర్ష్‌దీప్ సింగ్, డార్ల్ మిచెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన వాషింగ్టన్ సుందర్, వన్డేల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 64 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన సుందర్, సౌథా బౌలింగ్‌లో లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి ఆఖరి వికెట్‌గా అవుట్ అయ్యాడు...కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డార్ల్ మిచెల్ మూడేసి వికెట్లు తీయగా టిమ్ సౌథీకి రెండు వికెట్లు దక్కాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios