టీమిండియాకి దక్కని వార్మప్... వర్షంతో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కూడా రద్దు!
వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే రద్దు అయిన ఇండియా- నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్.. అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియాకి వార్మప్ దక్కలేదు. గౌహతిలో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్, టాస్ అయ్యాక రద్దు కాగా.. తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షంతో రద్దు అయ్యింది. బుధవారం ఎడతెడపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ వేయకుండానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు..
దీంతో వార్మప్ మ్యాచులు ఆడకుండానే ఐసీసీ ప్రపంచ కప్ ఆడేందుకు సిద్దమైంది భారత జట్టు. ఆసియా కప్ 2023 టోర్నీ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌కి దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా అండ్ కో.. దాదాపు 20 రోజుల తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో నేరుగా బరిలో దిగబోతున్నారు.
గౌహతిలో జరుగుతున్న శ్రీలంక - ఆఫ్ఘాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కుసాల్ మెండిస్ 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో 158 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. కుసాల్ మెండిస్ సెన్సేషనల్ సెంచరీ కారణంగా 33 ఓవర్లు ముగిసే సమయానికే 250+ దాటేసింది శ్రీలంక స్కోరు. పథుమ్ నిశ్శంక 30, దిముత్ కరుణరత్నే 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు..
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 40 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 48, మిచెల్ మార్ష్ 31, స్టీవ్ స్మిత్ 27, మార్నస్ లబుషేన్ 40 పరుగులు చేయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు..
బుధవారంతో వార్మప్ మ్యాచులు ముగుస్తాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య వన్డే వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ జరుగుతుంది. గత వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్టులు ఇండియా- ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 8న చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘాన్‌తో తలబడే టీమిండియా, అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది.