టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే పై విమర్శలు ఎక్కువౌతున్నాయి. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కి కెప్టెన్ గా వ్యహరించిన రహానే.. జట్టు విజయానికి సహకరించాడు. దీంతో అందరూ రహానే బెస్ట్ కెప్టెన్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో మాత్రం రహానే బ్యట్స్ మెన్ గా పూర్తిగా విఫలమయ్యాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత వరుసగా తక్కువ స్కోర్లకే అవుటవుతున్నాడు. ఎంసీజీ సెంచరీ తర్వాత రహానే చేసిన వరుగులు వరుసగా 27 నాటౌట్, 22, 4, 37, 24, 1, 0 . టాపార్డర్‌లో రహానే విఫలమవుతుండటంతో ఆ భారం తర్వాత వచ్చే బ్యాట్స్‌మాన్‌పై పడుతున్నది.

రహానే పేలవ ఫామ్‌పై సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. అతడు కెప్టెన్‌గా ఓకే కానీ బ్యాట్స్‌మాన్‌గా భారమయ్యాడు అంటూ విమర్శలు గుప్పించాడు. మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా కూడా రహానే తన ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. ఇందులో వేరే ప్రశ్నకు తావులేదన్నాడు. 

అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. మీరు రహానే విషయంలో గుంటలు తవ్వితే అందులో దొరికేది ఏమీ ఉండదు. ఈ విషయాన్ని గతంలోనూ చెప్పాను. టీమ్ ఇండియా టెస్టు జట్టులో పుజార, రహానేలు కీలక బ్యాట్స్‌మెన్లు. అతడి బ్యాటింగ్‌పై, శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్నది. విఫలమవడంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని కోహ్లీ అన్నాడు.