Asianet News TeluguAsianet News Telugu

అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్: పోరాడి ఓడిన భారత్.. విశ్వవిజేతగా బంగ్లాదేశ్

అండర్-19 వరల్డ్‌కప్‌లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. ఇన్నాళ్లు పసికూనగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచి ఇకపై తాను కసికూనని నిరూపించింది. 

India vs Bangladesh: under 19 world cup final upadates
Author
Potchefstroom, First Published Feb 9, 2020, 1:32 PM IST

అండర్-19 వరల్డ్‌కప్‌లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. ఇన్నాళ్లు పసికూనగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచి ఇకపై తాను కసికూనని నిరూపించింది.

బంగ్లాదేశ్ విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. క్రీజులో కెప్టెన్ అక్బర్ అలీ 42, రకిబుల్ హసన్ 3 పరుగులతో ఉన్నారు.

అనంతరం తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 170గా నిర్ణయించారు. దీంతో క్రీజులో ఉన్న కెప్టెన్ అక్బర్ అలీ 43, రకిబుల్ హసన్ 9 లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించారు. 

ఛేదనలో బంగ్లాదేశ్‌కు మెరుపు ఆరంభం లభించింది. అద్భుత ఫామ్‌లో తంజిద్ హాసన్, పర్వేజ్ హోస్సేన్‌లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రవి భిస్నోయ్ విడదీశాడు. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద తంజిత్ (17) కార్తీక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

రవి బిస్నోయి విజృంభించడంతో ఆ కాసేపటికే బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. మహమ్మదుల్ హసన్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. కీలక సమయంలో మంచి ఊపు మీదున్న పర్వేజ్ ఇమాన్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో బంగ్లా శిబిరంలో ఆందోళన మొదలైంది.

రవి భిష్ణోయ్ స్పిన్ మాయాజాలానికి బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 14.1 ఓవర్‌లో జట్టు స్కోరు 62 పరుగుల వద్ద ఉండగా తౌహిద్ హృదయ్ ‌ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు.
రవి భిష్ణోయ్ వేసిన 16.1 ఓవర్ బంతికి షహదత్ హోస్సేన్ 1 పరుగు వద్ద ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటంతో పరుగులు రావడం కష్టమైంది. ఈ క్రమంలో సుశాంత్ మిశ్రా బౌలింగ్‌లో షామీమ్ హుస్సేన్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఆ కొద్దిసేపటికే ఆల్ రౌండర్ అవిషేక్ దాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కార్తీక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

రిటైర్డ్ హర్ట్ తర్వాత మరోసారి బ్యాటింగ్‌కు వచ్చిన పర్వేజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస ఫోర్లతో జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జైస్వాల్ బౌలింగ్‌లో ఆకాశ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు బెంబేలేత్తించడంతో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలబడలేక, ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 88, తిలక్ వర్మ 38, ధ్రువ్ జురేల్ 22 మినహా ఎవ్వరూ రాణించలేదు. బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాస్ 3, ఇస్లామ్, తంజిమ్ హాసన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోియింది. దివ్యాన్షు సక్షేనా కేవలం 2 పరుగులు చేసి అవిషేక్ దాస్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. 

అనంతరం తిలక్ వర్మతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఆచితూచి ఆడుతూనే 89 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా అండర్ 19 వరల్డ్ కప్‌లో ఇది అతనికి ఇది నాలుగో అర్థసెంచరీ కావడం విశేషం.

భారత్ పుంజుకుంటున్న సమయంలో తిలక్ వర్మ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తంజిమ్ హాసన్ షకీబ్ బౌలింగ్‌లో ఇస్లామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

బంగ్లాదేశ్ బౌలర్లు రెచ్చిపోవడంతో టీమిండియా 11 పరుగుల వ్యవధిలోనే కెప్టెన్ ప్రియమ్ గార్గ్ వికెట్‌ను కోల్పోయింది. రకిబుల్ హసన్ బౌలింగ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తంజిమ్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి ప్రియమ్ ఔటయ్యాడు. 

షోరిఫుల్ ఇస్లామ్ విజృంభించి ఒకే ఓవర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ 88, సిద్దేశ్ వీర్‌లను ఔట్ చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించిన తర్వాత ప్రమాదకరంగా మారుతుండటంతో బంగ్లా కెప్టెన్ వ్యూహం మార్చి ఇస్లామ్‌కు బంతిచ్చాడు. 

జైస్వాల్ ఔటైన తర్వాత ధాటిగా ఆడిన వికెట్ కీపర్ ధృవ్ జూరేల్ 22 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో రవి భిస్నోయి 2 స్కోరు పెంచే క్రమంలో రనౌట్‌గా వెనుదిరిగ్గా.. ఆ తర్వాతి బతికి అథర్వ అంకోలేకర్ (3)‌ను అవిషేక్ దాస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అవిషేక్ దాస్ మరోసారి రెచ్చిపోయి చివరి వరుస బ్యాట్స్‌మెన్ కార్తీక్ త్యాగిని డకౌట్ చేశాడు. దీంతో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios