అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 72వ సెంచరీని నమోదు చేసిన విరాట్ కోహ్లీ... వన్డేల్లో 44వ సెంచరీ! డబుల్ సెంచరీ బాది అవుటైన ఇషాన్ కిషన్.. 

71వ సెంచరీ మార్కుని అందుకోవడానికి మూడేళ్లు ఎదురుచూశాడు విరాట్ కోహ్లీ... ఆసియా కప్‌లో టీ20ల్లో 71వ శతకాన్ని అందుకున్న విరాట్... మూడు నెలల గ్యాప్‌లోనే వన్డేలో శతకాన్ని నమోదు చేశాడు. తొలి రెండు వన్డేల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లీ... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 85 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు...

కెరీర్‌లో 72వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును అధిగమించేశాడు. సచిన్ టెండూల్కర్ ఒక్కడే 100 సెంచరీలతో విరాట్ కంటే ముందున్నాడు. వన్డేల్లో 44వ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు...

విరాట్ కోహ్లీకి ముందు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. 85 బంతుల్లో వన్డేల్లో తొలి సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, శతకం తర్వాత మరింత వేగంగా దూకుడు పెంచి 126 బంతుల్లో డబుల్ సెంచరీని అందుకున్నాడు...

వన్డేల్లో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషనే. బంగ్లాదేశ్‌లో ఇషాన్ కిషన్‌దే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు ఇషాన్ కిషన్...

ఈ మ్యాచ్‌లో సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, బంగ్లాపై అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 2000వ సంవత్సరంలో 7 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్...

ఇంతకుముందు కపిల్ దేవ్ తొలి సెంచరీ చేసిన మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 103 బంతుల్లో 150 దాటిన ఇషాన్ కిషన్, అత్యంత వేగంగా 150+ బాదిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ 112 బంతుల్లో 150+ స్కోరు నమోదు చేశాడు.

2020 జనవరిలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ బాదాడు రోహిత్ శర్మ. రెండున్నరేళ్ల తర్వాత టీమిండియా తరుపున వన్డేల్లో శతకం బాదిన ఓపెనర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. 

తొలి రెండు వన్డేల్లో సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయిన శిఖర్ ధావన్, మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన శిఖర్ ధావన్... మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

ఈ వన్డే సిరీస్‌లో 6 సగటుతో పరుగులు చేసిన శిఖర్ ధావన్, చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. శిఖర్ ధావన్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ తన స్టైల్‌లో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తే... విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఎక్కువగా సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...

1 పరుగు వద్ద విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ జారవిడిచాడు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. బంగ్లాదేశ్‌లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా గంభీర్ తర్వాతి స్థానంలో నిలిచాడు ఇషాన్ కిషన్...

గౌతమ్ గంభీర్ 21 ఏళ్ల 184 వయసులో బంగ్లాలో 50+ స్కోరు చేసిన భారత ఓపెనర్‌గా ఉండగా ఇషాన్ కిషన్ వయసు 24 ఏళ్ల 145 రోజులు. బంగ్లాదేశ్‌లో 1000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. బంగ్లాలో 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు విరాట్. రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌లో 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా విరాట్ ఆ రికార్డును సమం చేశాడు.. 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసి టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..