న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న శ్రీలంక... ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు ఓడితే, టీమిండియా ఫైనల్ చేరడం కష్టమే.. 

ఇండోర్ టెస్టు విజయంతో ఆస్ట్రేలియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది. ఇక మిగిలిన మరో బెర్త్ కోసం ఇండియా, శ్రీలంక రేసులో ఉన్నాయి. వాస్తవానికి శ్రీలంక, న్యూజిలాండ్‌లో కివీస్‌ని ఓడించి టెస్టు సిరీస్ గెలవగలదనే నమ్మకం ఎవ్వరికీ లేదు. దీంతో టీమిండియా ఆఖరి టెస్టులో ఈజీగా గెలిచి, ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుందని అనుకున్నారు..


అయితే అహ్మదాబాద్ టెస్టులో సీన్ మారింది. ఇండోర్ టెస్టు ఓటమితో మంచి బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేసిన టీమిండియా, టాస్ ఓడింది. బ్యాటింగ్ పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు, భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటూ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే 300 స్కోరు దాటేసిన ఆసీస్, చేతిలో మరో 6 వికెట్లు ఉండడంతో ఈజీగా 400+ చేసేలా కనబడుతోంది...

ఇటు పక్క ఆస్ట్రేలియా, భారత జట్టుకు చుక్కలు చూపిస్తుంటే, మరో వైపు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌ రేసులో ఉన్న శ్రీలంక టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మరింత భయపెడుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా క్రిస్ట్‌చర్చిలో జరుగుతున్న తొలి టెస్టులో పైచేయి సాధించింది శ్రీలంక..

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, మొదటి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 87 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 83 బంతుల్లో 16 ఫోర్లతో 87 పరుగులు చేశాడు...

ఏంజెలో మాథ్యూస్ 98 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేయగా, దినేశ్ చండీమల్ 64 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు, ధనంజయ డి సిల్వ 59 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేశారు. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌లో డిక్‌వాలా 7 పరుగులు మినహా మిగిలిన 10 బ్యాటర్లు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయడం విశేషం...

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 5 వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది...

టామ్ లాథమ్ 67 పరుగులు, డివాన్ కాన్వే 30 పరుగులు చేయగా స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. హెన్నీ నికోలస్ 2, టామ్ బ్లండెల్ 7 పరుగులు చేసి అవుట్ కాగా డార్ల్ మిచెల్ 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు...

తొలి టెస్టులో శ్రీలంక జట్టు, న్యూజిలాండ్‌ని ఓడిస్తే... టీమిండియా ఫైనల్ చేరేందుకు రెండో టెస్టు ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ తొలి టెస్టులో వచ్చిన ఊపుతో శ్రీలంక, రెండో టెస్టులోనూ న్యూజిలాండ్‌ని ఓడిస్తే... టీమిండియా నాలుగో టెస్టు ఓడిపోతే... ఫైనల్ చేరలేదు.

ఒకవేళ అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టుని టీమిండియా గెలిచినా, లేదా డ్రా చేసుకున్నా... శ్రీలంక ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది.. ఇండియా, ఆస్ట్రేలియా ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ ఆడతాయి.