ప్రపంచ క్రికెట్‌ లోనే అగ్ర జట్లుగా పేరుగాంచిన  రెండు జట్లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. వాంఖడెలో భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే  1.30 గంటలకు ప్రారంభమవనుంది.  2019 వరల్డ్‌కప్‌ తర్వాత తొలిసారి వన్డే ఫార్మాట్‌లో గేమ్ ఆడనున్న ఆస్ట్రేలియా కోహ్లిసేనకు తొలి సవాల్‌ విసిరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

వరల్డ్‌కప్‌కు ముందు అండర్‌డాగ్‌గా భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా 2-0తో టీ20 సిరీస్‌, 3-2తో వన్డే సిరీస్‌ లను సొంతం చేసుకుంది. ఇప్పుడు సమవుజ్జీగా టీమ్‌ గా  టీం ఇండియాకు సవాల్‌ విసురుతోన్న కంగరూ జట్టు సిరీస్‌ విజయంపై గురి పెట్టింది. 

కెప్టెన్‌గా స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో టీ20, వన్డే సిరీస్‌లు ఓడిపోవటం విరాట్‌ కోహ్లి నాయకత్వానికి ఒక చేదు జ్ఞాపకం. ఈ సిరీస్‌ విజయంతో ఆ లెక్క ఎలాగైనా సరిచేయాలని విరాట్‌ ధృడ సంకల్పంతో ఉన్నాడు. . 

లోయర్‌ మిడిల్ ఆర్డర్ మెరిసినా...?

భారత 50 ఓవర్ల జట్టుకు ఎటువంటి ఢోకా లేదు. కానీ లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ లో అనుభవ లేమి, ఒత్తిడిలో నిలువలేనితనం 2019 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాను దారుణంగా దెబ్బతీశాయి. స్వదేశంలో జరుగనున్న 2023 వరల్డ్‌కప్‌లో అటువంటి సమస్య పునరావృతం కాకూడదని కోహ్లిసేన భావిస్తోంది. 

కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజాలు లోయర్‌ ఆర్డర్‌లో ఆడనున్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌ సాధించలేదు. టెయిలెండర్‌ షార్దుల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఠాకూర్‌కు ప్రమోషన్‌ లభించే అవకాశం లేకపోలేదు. 

Also read: బ్యాటింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా..?

టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ భారత్‌కు కీలకం. వాంఖడెలో ఘనమైన రికార్డు, ఆసీస్‌పై ఎదురులేని గణాంకాలు రోహిత్‌ శర్మను నేటి మ్యాచ్‌లో కీలకం చేస్తున్నాయి. శిఖర్‌ ధావన్‌ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై అద్భుత శతకం సాధించాడు. నేడు అదే ప్రదర్శన రిపీట్‌ చేసేందుకు ఉవ్విళ్లురుతున్నాడు. 

కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు మిడిల్‌ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నారు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్‌ టెండూల్కర్‌ (20) రికార్డుకు విరాట్‌ కోహ్లి (19) కేవలం ఒకే ఒక్క శతకం దూరంలో ఉన్నాడు. 

ఆసీస్‌పై వాంఖడె సెంచరీతో మాస్టర్‌ సరసన నిలిచేందుకు విరాట్‌ రంగం సిద్ధం చేసుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా రాకతో పూర్వ వైభవం వచ్చినట్లయింది. మహ్మద్‌ షమి, షార్దుల్‌ ఠాకూర్‌లతో కలిసి బుమ్రా పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఆసీస్‌పై బుమ్రాకు కూడా మంచి రికార్డుంది. కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి రవీంద్ర జడేజా స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. 

దుర్భేద్యమైన కంగారూల పేస్‌ త్రయం...  

ఆస్ట్రేలియా పేస్‌ త్రయం పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హెజిల్‌వుడ్‌ సుదర్ఘ విరామం తర్వాత ఓ వన్డేలో కలిసి బరిలోకి దిగనున్నారు. ఎటువంటి పిచ్‌లపైనయినా అదనపు బౌన్స్‌, మంచి పేస్‌ రాబట్టగల సమర్థులు ఈ ఆసీస్‌ పేస్‌ త్రయం. 

భారీ స్కోర్లు సాధించే పిచ్‌ లపైన ఈ ముగ్గురు సీమర్ల ప్రదర్శన ఆసీస్‌కు అత్యంత కీలకం. యువ స్పిన్నర్‌ ఆడం జంపా భారత బిగ్‌ హిట్టర్లకు ఎలాంటి సవాలు విసురుతాడనేది ఆసక్తికరం. 

బ్యాటింగ్‌ లైనప్‌లో డెవిడ్‌ వార్నర్‌, కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. వార్నర్‌కు వాంఖడెలో మెరుగైన రికార్డుండగా, గత సిరీస్‌లో ఫించ్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో సూపర్‌ ఫామ్‌ కనబరిచిన మార్నస్‌ లబుషేన్‌ వన్డేల్లోనూ ఘనమైన అరంగ్రేటానికి సిద్ధమవుతున్నాడు. 

నెంబర్ 3లో స్టీవ్‌ స్మిత్‌ పునరాగమనం ఆస్ట్రేలియాకు కొండంత బలం. గత సిరీస్‌లో ప్రభావం చూపిన ఆస్టన్‌ ఆగర్‌, హ్యాండ్స్‌ కొమ్బ్ మంచి గేమ్ ఆడటంపై దృష్టి సారిస్తున్నారు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ క్యారీ ఫినిషర్‌గా పేరు తెచ్చుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని సంకల్పించాడు. మొన్న అతని ప్రెస్ మీట్ లో ధోని లాగా మారాలని అనడం వెనకున్న ఆంతర్యం ఇదే!

ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది...?

రెండో ఓపెనర్‌ రేసు నేడు తేలేలా కనిపించడం లేదు. శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌ ఇద్దరు నేడు ఆడే అవకాశం ఉంది. శ్రీలంకపై సిరీస్‌లో టాప్‌ ఆర్డర్‌లో రాహుల్‌, ధావన్‌ రాణించారు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో కెఎల్‌ రాహుల్‌ జట్టులో ఉండే వీలుంది. 

Also read: బీసీసీఐ అవార్డ్స్ లో కోహ్లీ బ్రైట్ స్మైల్... ఫోటోలు వైరల్

రోహిత్‌ జతగా ధావన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. ఐదో బౌలింగ్‌ ఆప్షన్ గా రవీంద్ర జడేజా, నం.6 బ్యాట్స్‌మన్‌గా కేదార్‌ జాదవ్‌ తుది జట్టులో ఉండే ఆస్కారం ఎక్కువ. బుమ్రా పునరాగమనంతో నవదీప్‌ సైని స్థానం త్యాగం చేయక తప్పేలా లేదు.  షార్దుల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ మెరుపులు తుది జట్టులో అతడి చోటును మరింత బలోపేతం చేయనుంది. 

పిచ్‌, వెదర్ కండిషన్స్... 

వాంఖడె పిచ్ పై పచ్చిక బాగానే ఉంది. సోమవారం ఉదయం కూడా పిచ్ పై వాటర్ కొట్టారు. లైట్ రోలింగ్ కూడా చేసారు. నేటి సాయంత్రం మంచు ప్రభావం ఉండనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ చేసేందుకు మొగ్గు చూపనుంది. 

డిసెంబర్‌లో  ఇదే పిచ్ పై భారత్ వెస్టిండీస్‌ తో టీ20లో 240 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సహజంగానే బ్యాటింగ్ స్వర్గధామమైన వాంఖడెలో  నేడు కూడా పరుగుల వరద పారనుంది. 

ప్లేయింగ్ ఎలెవన్(అంచనా) 

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, షార్దుల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా. 

ఆస్ట్రేలియా : డెవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, అలెక్స్‌ క్యారీ, అష్టన్‌ ఆగర్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హెజిల్‌వుడ్‌, ఆడం జంపా.