తెలుగోడి సెంచరీ వృదా ... భాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా పరాజయం
మెల్ బోర్న్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన భాక్సింగ్ డే టెస్ట్ లో ఆతిథ్య జట్టునే విజయం వరించింది. టీమిండియా ఆటగాళ్లు మరీముఖ్యంగా సీనియర్ల ఘోర వైఫల్యమే ఓటమికి కారణం.
India vs Australia Fourth Test : తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సెంచరీ పనిచేయలేదు... మరో యువకెరటం యశస్వి జైస్వాల్ పోరాటం ఫలించలేదు... చివరకు బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా కూడా ఏ అద్భుతం చేయలేకపోయాడు... ఇలా టీమిండియా ఆటగాళ్ళు ఎంత పోరాడినా చివరకు భాక్సిండ్ డే టెస్ట్ లో విజయం ఆస్ట్రేలియానే వరించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ లో భాగంగా మెల్ బోర్న్ మైదానంలో జరిగిన నాలుగో టెస్ట్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 184 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్ ల ఈ సీరిస్ లో టీమిండియా 1-2 తో వెనకబడింది. చివరిటెస్ట్ లో టీమిండియా గెలిచినా 2-2 ఇరుజట్లు సమంగా నిలుస్తాయి... కానీ రోహిత్ సేన గెలిచే అవకాశం లేదు.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాదిరిగానే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా సీనియర్లు చేతులెత్తేసారు. ఈ భాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో చివరిరోజు 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చతికిలపడింది. కనీసం ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యంలో సగం పరుగులు కూడా చేయలేకపోయింది. కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాదిరిగానే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఓపెనర్ యశస్వి జైస్వాల్ పోరాడినా అతడికి మరో ఎండ్ నుండి సహకారం లభించలేదు. దీంతో అతడు 155 పరుగులకే టీమిండియా కుప్పకూలింది.
ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి తట్టుకోలేక టీమిండియా ఆటగాళ్ళు చేతులెత్తేసారు. యశస్వి జైస్వాల్ (84 పరుగులు), రిషబ్ పంత్ (30 పరుగులు) మినహా మిగతా ఆటగాళ్లెవరూ కనీసం రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. అంతేకాదు ముగ్గురు ఆటగాళ్లు (కెఎల్ రాహులు, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యారు. జైస్వాల్ ఒక్కడే 84 పరుగులు చేసాడు... మిగతా పదిమంది కలిసి కూడా అతడు చేసినన్ని పరుగులు చేయలేకపోయారు.
టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ సాగిందిలా :
రెండు ఇన్నింగ్స్ లలో కలిపి టీమిండియాపై ఆస్ట్రేలియా 340 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. అంటే నాలుగో టెస్ట్ లో చివరిరోజు టీమిండియా గెలవాలంటే 340 పరుగులు కొట్టాలి. కానీ భారత బ్యాటింగ్ ఏ దశలోనూ ఈ లక్ష్యచేధన దిశగా సాగలేదు. ఫస్ట్ ఇన్సింగ్ నుండి పాఠాలేమీ నేర్చుకోనట్లున్నారు మన ఆటగాళ్లు... అదే పేలవ ప్రదర్శన కొనసాగించారు. దీంతో మ్యాచ్ చేయి దాటిపోయి ఆతిథ్య జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.
టీమిండియా సీనియర్లు మరోసారి విఫలమయ్యారు... కుర్రాళ్లు రాణిస్తున్న పిచ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ (9 పరుగులు), విరాట్ కోహ్లీ (5 పరుగులు) మరోసారి తడబడ్డారు. ఇక కెఎల్ రాహుల్ అయితే మరీ దారుణంగా డకౌట్ అయ్యాడు. రవింద్ర జడేజా 2, వాషింగ్టన్ సుందర్ 5(నాటౌట్), అకాశ్ దీప్ 7 పరుగులు మాత్రమే చేసారు. బుమ్రా, మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యారు.
ఇక మొదటి ఇన్నింగ్స్ లో చెలరేగి అద్భుత బ్యాటింగ్ తో సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసాడు. అతడు కేవలం ఐదు బంతుల్లో ఒక్కపరుగు మాత్రమే చేసి లియాన్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో అతడిపై పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరై టీమిండియా ఓటమి ఖాయమైపోయింది. కేవలం 155 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగియడంతో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భాక్సింగ్ డే టెస్ట్ హైలైట్స్ :
మెల్ బోర్న్ మైదానంలో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. మొదటి ఇన్నింగ్స్ లో అయితే ఆసిస్ ఆదిపత్యం స్పష్టంగా కనిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టులో టాప్ ఆర్డర్ రాణించింది. యువ ఓపెనర్ కొంటాస్ 60, ఖవాజా 57,లబుషనే 72, కారీ 31, కమిన్స్ 49 పరుగులు చేసారు. ఇక స్టీవ్ స్మిత్ భారత బౌలర్లపై విరుచుకుపడూ సెంచరీ (140 పరుగులు) సాధించాడు.
ఇక టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (82 పరుగులు), తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులతో అదరగొట్టారు. నితీష్ కు తోడుగా వాషింగ్టన్ సుందర్ కూడా చివర్లో అద్బుతమైన హాఫ్ సెంచరీ (162 బంతుల్లో 50 పరుగులు) చేసాడు. ఇక కోహ్లీ 36 పరుగులతో పరవాలేదనపించాడు. నితీష్-వాషింగ్టన్ జోడి చివరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా 369 పరుగులు చేయగలిగింది.
తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ విషయానికి బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక రవీంద్ర జడేజా 3,ఆకాశ్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ 3, బోలాండ్ 3, లియాన్ 3 వికెట్లు తీసారు.
రెండో ఇన్నింగ్స్ లో బౌలర్ల హవా సాగింది.టీమిండియా బౌలర్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసారు. బుమ్రా ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు...దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 9 వికెట్లు అతడి ఖాతాలో చేరాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్లేమీ తీయలేకపోయిన హైదరబాదీ బౌలర్ సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం 3 వికెట్లు తీసాడు. రవీంద్ర జడేజా మరో వికెట్ తీసాడు.
ఇక ఆసిస్ బౌలర్లలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాదిరిగానే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కెప్టెన్ కమిన్స్ 3, బొలార్డ్ 3 వికెట్లు పడగొట్టారు. నాథన్ లియాన్ 2, స్టార్క్ 1, హెడ్ 1 వికెట్ పడగొట్టారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఇరు జట్లలోనూ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 84 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆ తర్వాత లబుషనే 70, కమిన్స్ 41, లియాన్ 41 పరుగులు వున్నాయి. టీమిండియాలో రిషబ్ పంత్ 30 పరుగులే నాలుగో హయ్యెస్ట్ స్కోర్. దీన్నిబట్టే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలర్ల హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తంగా ఆస్ట్రేలియా బౌలర్ దాటికి టీమిండియా చేతులెత్తేసింది... భాక్సింగ్ డే టెస్ట్ విజయం ద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఆసిస్ 2-1 తో ముందంజలో వుంది. దీంతో చివరి టెస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఓటమితో టీమిండియాకు సీరిస్ విజయావకాశాలు ఇక లేనట్లే... కానీ గెలుపు ద్వారా 2-2 తో సమం చేయవచ్చు. జనవరి 7, 2025 లో ఐదో టెస్ట్ సిడ్నీలో జరగనుంది... కొత్త సంవత్సరంలో అయినా టీమిండియా ఆటతీరు మారుతుందేమో చూడాలి.