ఆఖరి రోజు 72 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియా.. మ్యాచ్ రిజల్ట్ తేలే అవకాశం లేకపోవడంతో డ్రాకు అంగీకరించిన ఇరు జట్ల కెప్టెన్లు.. 

అనుకున్నట్టుగానే ఎలాంటి హై డ్రామా లేకుండా అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా, మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది...

మొట్టమొదటిసారిగా వరుసగా నాలుగోసార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన జట్టుగా నిలిచింది టీమిండియా. ఇప్పటికే మూడో టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, న్యూజిలాండ్ చేతుల్లో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా కూడా ఫైనల్‌కి అర్హత సాధించింది...

ఓవర్‌నైట్ స్కోరు 3/0 వద్ద ఆఖరి రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా... 78.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసింది. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా కంటే 84 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా... నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన మాథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి అవుట్ కాగా ట్రావిస్ హెడ్ 163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 90 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయిన ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనితో పాటు స్టీవ్ స్మిత్ 59 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు..

పిచ్ ఎంతకీ బౌలర్లకు సహకరించకపోవడంతో పూర్తి ఓవర్ల పాటు ఆడినా వృథాయేనని భావించిన ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకి అంగీకరించారు. ఎంతకీ వికెట్లు పడకపోవడంతో శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారాలతో కూడా బౌలింగ్ చేయించాడు రోహిత్ శర్మ. శు‌బ్‌మన్ గిల్ 79వ ఓవర్‌లో ఓ బాల్ వేసిన తర్వాత రోహిత్, స్టీవ్ స్మిత్‌తో మాట్లాడి డ్రాకి ఒప్పించడంతో మ్యాచ్‌ ముగిసిపోయింది...

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేయగా కామెరూన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీశాడు. బదులుగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ 186 పరుగులు చేయగా శుబ్‌మన్ గిల్ 128 పరుగులు చేశాడు...

తన కెరీర్‌లో ఆరు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి డ్రా.. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్ శర్మ, ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవి చూశాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన ఇండియా, ఆస్ట్రేలియా... ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌లో టైటిల్ ఫైట్‌లో పాల్గొంటాయి. ఇంగ్లాండ్‌లో ది ఓవల్‌లో జూన్ 7 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. అప్పటి వరకూ ఫిట్‌గా ఉండి, టెస్టు సారథిగా కొనసాగితే రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇదే మొట్టమొదటి టెస్టు మ్యాచ్ అవుతుంది.