Asianet News TeluguAsianet News Telugu

సీట్లు అధ్వాన్నం! వసతులు దారుణం... ఉప్పల్ స్టేడియంలో ఆదరబాదరగా పనులు పూర్తి చేస్తున్న హెచ్‌సీఏ...

అధ్వాన్నంగా ఉప్పల్ స్టేడియంలో సీట్ల పరిస్థతి... ఇప్పటిదాకా ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోని హెచ్‌సీఏ...

India vs Australia 3rd T20I host Hyderabad Uppal Stadium getting ready, no Noc from fire department
Author
First Published Sep 24, 2022, 3:46 PM IST

హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లు కావస్తోంది. కరోనా కబుర్లు వినిపించకముందు 2019లో వెస్టిండీస్, ఇండియా మధ్య టీ20 మ్యాచ్‌కి వేదికనిచ్చింది హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఆ తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ని హైదరాబాద్‌లో నిర్వహించాలని భావించారు..

అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో మ్యాచులు జరగలేదు. దాదాపు మూడేళ్లుగా ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...

ఆసియా కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించినప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి కూడా షెడ్యూల్ ఖరారు చేసింది బీసీసీఐ. అంటే నెల రోజుల ముందే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతున్నట్టు అభిమానులకు తెలిసింది. దానికి కొన్ని నెలల ముందే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి ఈ సమాచారం అందుతుంది...

అయితే మూడేళ్లుగా పట్టించుకోని క్రికెట్ స్టేడియానికి అవసరమైన మరమ్మత్తులు చేసేందుకు, మెరుగులు దిద్దేందుకు చర్యలు తీసుకోలేదు హెచ్‌సీఏ. ఇప్పటిదాకా ఉప్పల్ స్టేడియానికి ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) రాలేదని సమాచారం...

2019లో నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టడంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఉన్న పర్మిషన్‌ని రద్దు చేసింది అగ్ని మాపక శాఖ. అప్పటి నుంచి అంతర్జాతీయ మ్యాచులు జరగగకపోవడంతో దాన్ని రినివల్ చేసే అవసరం రాలేదు. చేయాలనే ఆలోచన కూడా హెచ్‌సీఏ చేయలేదు...

స్టేడియంలో పొగ వస్తే గుర్తించే అలారంతో అప్రమత్తం చేసే స్మోక్ డిటెక్టర్లు లేవని, అలాగే ఆటోమేటిక్‌గా మంటలను ఆర్పి వేసేందుకు ఏర్పాటు చేసే స్ప్రింకల్స్ కానీ 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకులు కానీ లేవని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది...

అన్నింటికీ మించి స్టేడియంలో ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ చూసేందుకు ఏర్పాటు చేసిన కూర్చీలపై 3 ఏళ్లుగా పావురాలు, పక్షులు రెట్టలతో నింపేశాయి. వీటిని ఇప్పటిదాకా శుభ్రం చేయలేదు హెచ్‌సీఏ. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చే వేల మంది ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ చూసేందుకు వచ్చేవాళ్లే సబ్బు, బకెట్ నీళ్ల తీసుకొని వచ్చి కూర్చీలు క్లీన్ చేసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మ్యాచ్‌కి సమయం దగ్గర పడుతుండడంతో మూడు రోజుల నుంచి ఆదరా బాదరాగా ఏర్పాట్లు చేస్తోంది హెచ్‌సీఏ. స్టేడియం వైపుగా వెళ్తున్న వారికి గ్రౌండ్ ఆవరణలో మొక్కలను శుభ్రం చేయడం, గ్రీన్ గ్రాస్ ఏర్పాటు చేయడం వంటి పనులు జరుగుతుండడం నేటికీ కనిపిస్తోంది...

ఇప్పటికే ఫైనల్ టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్‌కి చేరుకున్నారు ఇండియా, ఆస్ట్రేలియా క్రీడాకారులు. నేటి సాయంత్రం గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనబోతున్నారు. అసలే మ్యాచ్ టికెట్ల విక్రయం విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఈ ఆఖరి టీ20 మ్యాచ్‌ని సజావుగా నిర్వహించగలుగుతుందా? అనేది హైదరబాదీలకు పెద్ద అనుమానంగా మారింది... 

Follow Us:
Download App:
  • android
  • ios