IND vs AUS: మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో ఆసీస్ ఘన విజయం..
India vs Australia 3rd T20 2023: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించింది.
India vs Australia 3rd T20 2023: నేడు టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకున్న టీమిండియాకు కంగారూ టీం (Australia) దిమ్మ తిరిగే షాకిచ్చింది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరిగింది. నిజంగా నరాలు తెగే ఈ ఉత్కంఠ పోరులో భారత్ పై ఆసీస్ టీం విజయం సాధించింది. ఈ మ్యాచ్(India vs Australia)లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో మ్యాక్స్‌వెల్ (Maxwell) విధ్వంసం సృష్టించాడు. ఓడిపోయే స్థితిలో ఉన్న ఆసీస్‌ను ఒంటి చేతితో గెలిపించినా తీరు టీమిండియా ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. భారీ స్కోరు చూసిన సగటు టీమిండియా అభిమాని ఈ మ్యాచ్ సులభంగా గెలుస్తుందిలే భావించాడు. కానీ, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన తీరుతో తన టీమ్ కు విజయం అందించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు సహాయంతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన మెరుపు సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
టీమిండియా నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కంగారూ టీం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ కూడా భారత బౌలర్లపై చెలారేగాడు. 18 బంతుల్లో 8 ఫోర్లు బాది 35 పరుగులు చేశాడు. అలాగే.. మాథ్యూ వేడ్ కూడా రాణించాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు.
చివరి బంతి వరకూ ఉత్కంఠగానే
చివరి ఓవర్‌లో ఆసీస్ 21 పరుగులు చేయాల్సి ఉండగా.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. మ్యాక్స్‌వెల్, వేడ్‌ల వేగానికి అడ్డుకట్ట వేశాడని టీమిండియా ఫ్యాన్స్ భావించారు. కానీ..వారిద్దరూ చివరి ఓవర్ లో పరుగుల వరద పారించారు. చివరి ఓవర్ చివరి బంతికి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. చివరి ఓవర్ తొలి బంతికి వేడ్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఆ తర్వాత మూడో బంతికి మ్యాక్స్‌వెల్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టి మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ టీ20లో నాలుగో సెంచరీ పూర్తి చేశాడు.ఇక చివరి బంతికి ఆస్ట్రేలియాకు రెండు పరుగులు అవసరం కాగా మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో యంగ్ ప్లేయర్ రితురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది కాకుండా తిలక్ వర్మ 24 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 141 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక 20వ ఓవర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్ చేశారు. మ్యాక్స్‌వెల్ వేసిన 20వ ఓవర్ లో రితురాజ్ విరుచుకపడ్డాడు. ఈ ఓవర్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. మొత్తానికి చివరి ఓవర్లో టీమిండియాకు 30 పరుగులు దక్కాయి. చివరి ఐదు ఓవర్లలో టీమిండియా 79 పరుగులు చేసింది.
టీ20లో భారత్ తరఫున సెంచరీ చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా రితురాజ్ నిలిచాడు. అతని కంటే ముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై టీ20లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రుతురాజ్ నిలిచాడు. రితురాజ్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు.
అదే సమయంలో తిలక్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. అంతకు ముందు యశస్వి జైస్వాల్ ఆరు పరుగులు చేయగా.. ఇక ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రీతురాజ్ మూడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్య 29 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరఫున కేన్ రిచర్డ్‌సన్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెండార్ఫ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.