బెంగళూరు వన్డే: ఏకపక్షం.. ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం, సిరీస్ కైవసం
ఆస్ట్రేలియాపై జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఇండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో ఇండియా 7 వికెట్ల తేడాతో కంగారూలను మట్టి కరిపించింది.
బెంగళూరు వన్డేలో భారత్ .. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించుని, మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ 119, విరాట్ కోహ్లీ 89, శ్రేయస్ అయ్యర్ 44 పరుగులతో విజృంభించడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఆస్ట్రేలియా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్లపై ప్రభావం చూపలేకపోయారు.
. 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ.. హేజల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దాంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అప్పుడు భారత్ విజయం సాధించాలంటే 72 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 57వ అర్థసెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100వ అర్థ శతకం కావడం గమనార్హం. గతేడాది సూపర్‌ఫాంలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఆసీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 110 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో వన్డేల్లో 29వ శతకం బాదేశాడు.
అంతకు ముందు రోహిత్ శర్మ 55 బంతుల్లో అర్థసెంచరీని పూర్తి చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆగర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
బెంగళూరు వన్డేలో ఆస్ట్రేలియా.. భారత్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లతో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్లు వెంట వెంటనే ఔట్ అయినప్పటికీ స్మిత్ 131 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. లబూషేన్ 54, అలెక్స్ క్యారీ 35 అతనికి చక్కని తోడ్పాటు అందించారు.
ఒకదశలో ఆసీస్ 300 పైచిలుకు స్కోరు సాధిస్తుందని భావించినప్పటికీ చివర్లో స్మిత్, కమ్మిన్స్, ఆడం జంపాను షమీ వెంట వెంటనే ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ 4, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు షమీ ధాటికి ఆసీస్ ఒకే ఓవర్ రెండు వికెట్లు కోల్పోయింది. 47వ ఓవర్ తొలి బంతికి స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన షమీ.. అదే ఓవర్ నాలుగో బంతికి ప్రమాదకర పాట్ కమ్మిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్‌గా వెనక్కి పంపాడు.
వికెట్లు పడుతున్నా సంయమనంతో బ్యాటింగ్ చేసిన స్టీవెన్ స్మిత్ ఎట్టకేలకు ఔటయ్యాడు. 132 బంతుల్లో 131 పరుగులు చూసి జట్టుకు మంచి స్కోర్ అందించిన స్మిత్.. షమి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.
నవదీప్ షైనీ బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆస్టన్ టర్నర్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. రెండో వన్డేలో కొద్దిలో సెంచరీని మిస్సయిన స్టీవెన్ స్మిత్ చివరి వన్డేలో ఆ లోటును పూడ్చుకున్నాడు. 117 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకాన్ని నమోదు చేశాడు. ఇది అతనికి వన్డేల్లో 9వ సెంచరీ.
దానికి ముందు స్కోరు బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. స్మిత్‌తో కలిసి దూకుడుగా ఆడిన కీపర్ అలెక్స్ క్యారీ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి.
భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన స్టీవ్ స్మిత్-లబ్‌షేన్ జంటను ఎట్టకేలకు జడేజా విడదీశాడు. ఓపెనర్లు ఔటైన తర్వాత స్మిత్, లబ్‌షేన్ నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన లబుషేన్ .. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికి చాహల్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
నిలకడకు మారుపేరైన స్టీవ్ స్మిత్ మరోసారి ఆ పేరును నిలబెట్టుకున్నాడు. చివరి వన్డేలో ఓపెనర్లిద్దరూ వెనుదిరిగిన సమయంలో స్మిత్, లబుషేన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో స్మిత్ 63 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. తొలి వన్డేలో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఆరోన్ ఫించ్19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత మెరుపు ఫీల్డింగ్‌కు రనౌటయ్యాడు. షమీ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, షమీ చక్కిన సమన్వయంతో ఫించ్ రనౌటయ్యాడు.
బెంగళూరు: షమీ బౌలింగ్ లో బాల్ ని పూర్తిగా అంచనా వేయడంలో విఫలమైన వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ కీపర్ రాహుల్ చేతిలోకి వెళ్ళింది. దాన్ని రాహుల్ ఒడిసి పట్టడంతో వార్నర్ పెవిలియన్ చేరవలిసి వచ్చింది. మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వార్నర్ ఔటయ్యాడు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నేడు చిన్నస్వామిలో మరో పరుగుల పండుగ ఖాయమని ఇప్పటికే పిచ్ నిర్వాహకులు తెలిపారు. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఖచ్చితంగా కనిపించింది.
ప్లేయింగ్ ఎలెవన్
భారత్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాష్ అయ్యర్, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైని, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, డెవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారె, అష్టన్ టర్నర్, ఆష్టన్ ఆగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ వుడ్ , ఆడం జంపా.