సారాంశం

India vs Australia 2nd ODI: 8 పరుగులు చేసి అవుటైన రుతురాజ్ గైక్వాడ్.. 9.5 ఓవర్లలో 79 పరుగులు చేసిన భారత జట్టు.. వర్షంతో ఆగిన ఆట...

 

ఇండోర్‌ వేదికగా  ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేకి వరుణుడు బ్రేక్ వేశాడు. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 9.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది టీమిండియా. గత మ్యాచ్‌లో 70+ పరుగులు చేసి ఆకట్టుకున్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఆ ఫామ్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు..

12 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్, క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఆసీస్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు..

ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో 2 ఫోర్లు బాదిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో 2 ఫోర్లు బాది 11 పరుగులు రాబట్టాడు. అయ్యర్ దూకుడుకి అడ్డు కట్ట వేయాలని బౌలింగ్ మార్పులు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు.

19 బంతుల్లో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, సీన్ అబ్బాట్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో వరుసగా 6, 2, 4 బాది 14 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ వేసిన 10వ ఓవర్‌లో 4, 6 బాదాడు శుబ్‌మన్ గిల్...

శుబ్‌మన్ గిల్ సిక్సర్ బాదగానే వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు అంపైర్లు. శుబ్‌మన్ గిల్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ 20 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు..

ఈ ఇద్దరూ 37 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం చేశారు. మొదటి 5 ఓవర్లు ముగిసే సమయానికి 26 పరుగులే చేసిన టీమిండియా, 9.5 ఓవర్లకు 79 పరుగులకు చేరుకోవడం విశేషం..